ఆన్‌లైన్‌ క్లాసులకు ఫోన్‌లు లేకపోవడంతో ...

26 Jun, 2020 16:25 IST|Sakshi

జార్ఖండ్‌: కరోనా మహమ్మారి విజృంభించడంతో మార్చి మధ్యలో నుంచే స్కూళ్లన్నింటిని మూసివేశారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎ‍త్తివేసిన తరువాత కూడా ఇంకా పాఠశాలలను తెరవడానికి ఇంకా ప్రభుత్వాలు అనుమతినివ్వలేదు. దీంతో దాదాపు పాఠశాలలన్ని ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. మరి ఇంటర్నెట్‌, లాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్లు లేని వారి పరిస్థితి ఏంటి? అలా ఏ సదుపాయం లేని పిల్లల కోసం జార్ఖండ్‌లోని ఒక స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌కు వినూత్నమైన ఆలోచన వచ్చింది. (ఆన్‌లైన్ చదువు: స్మార్ట్‌ ఫోన్‌ లేదని..)

జార్ఖండ్‌లోని బంకతి మిడిల్‌ స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ శ్యామ్‌ కిషోర్‌ గాంధీ స్కూల్‌ చుట్టూ, పిల్లలు ఎక్కువగా ఉండే చోట మైక్‌లు పెట్టించారు. స్కూల్‌ నుంచి ఐదుగురు టీచర్లు  పాటలు చెబుతుంటే పిల్లలు వినేలా ఏర్పాట్లు చేశారు. పిల్లలకు ఏదైనా సందేహాలు వస్తే తన ఫోన్‌కు కానీ మిగిలిన ఎవరైనా స్టాఫ్‌ ఫోన్‌కు మెసేజ్‌ చేస్తే మరుసటి రోజు వాటిని అర్థం అయ్యేలా చెబుతున్నారు.  ఏప్రిల్‌ 16 నుంచి ప్రతి రోజు రెండు గంటల పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 8 తరగతి వరకు ఆ పాఠశాలలో 246 మంది విద్యార్థులు చదువుతుండగా, 204 మందికి స్మార్ట్‌ ఫోన్‌లు లేవని హెడ్‌ మాస్టర్‌ తెలిపారు. దీంతో వారి కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయితే ఇలా నిర్వహిస్తున్న తరగతులకు దాదాపు 100 శాతం మంది హాజరవుతున్నారని కొన్ని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఈ మాస్టర్‌ చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుందంటూ కామెంట్‌ చేస్తున్నారు.  (ఆన్‌లైన్‌ విద్య.. ఒక భాగం  మాత్రమే! )
  

మరిన్ని వార్తలు