ఉగ్రవాదం కంటే ప్రేమ మరణాలు ఎక్కువ

2 Apr, 2017 09:02 IST|Sakshi
ఉగ్రవాదం కంటే ప్రేమ మరణాలు ఎక్కువ

ప్రేమ తియ్యనిది. ఇది ప్రేమికులు చెప్పే మాట. మరి ఉగ్రవాదం. భయంకరమైనది ఇది సమాజం నుంచి వినిపించే గొంతు. అయినా ప్రేమ, ఉగ్రవాదంల గురించి చర్చ దేనికి. అందుకు కారణం ఉంది. భారత్‌లో ఉగ్రవాద దాడుల్లో కన్నా ఎక్కువ మంది ప్రేమ కారణంగానే బలవుతున్నారు. గత పదిహేనేళ్ల మరణాల రికార్డును ఓ సారి తిరగేస్తే ప్రస్ఫుటమయ్యేది ఈ విషయమే. ప్రేమ ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారుతున్న వివరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

2001 నుంచి 2015 వరకూ ప్రేమ కారణంగా 38,585 మంది భారతీయులు హత్యకు గురయ్యారు. ఇవి కాకుండా 79,189 ఆత్మహత్యలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. ఇదే కాలంలో దాదాపు 2.6 లక్షల మంది అమ్మాయిలు 'పెళ్లి' అనే కారణంతో ఆచూకీ లేకుండా పోయారు. రోజూ సగటున ఏడు హత్యలు, 14 ఆత్మహత్యలు, 47 కిడ్నాప్‌లు దేశంలో జరుగుతున్నాయి. వీటిన్నింటికి ప్రధాన కారణం అమ్మాయి, అబ్బాయిల ప్రేమకు ఇంట్లో అడ్డుచెప్పడం (లేదా) అమ్మాయి, అబ్బాయిలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.

ఇదే 15 సంవత్సరాల కాలంలో కేవలం 20 వేల మంది పౌరులు, సైనికులు ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రేమ పేరుతో హత్యలు జరుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్ధానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లు వరుసగా తర్వాతి స్ధానాల్లు ఉన్నాయి. ఆత్మహత్యల్లో పశ్చిమ బెంగాల్‌ టాప్‌లో ఉంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే పద్నాలుగు సంవత్సరాల్లో 15 వేల మందికి పైగా ప్రేమ విఫలం చెందడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని రికార్డులు చెబుతున్నాయి.

9,405 ఆత్మహత్యలతో ఆ తర్వాతి స్ధానంలో తమిళనాడు ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లు వరుసగా తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉంది.

మరిన్ని వార్తలు