ఎల్పీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ

10 Apr, 2019 09:00 IST|Sakshi
కవిత ఫమన్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థిని కవిత ఫమన్‌ సత్తా చాటారు. బహుళజాతి విత్తన, ఎరువుల సంస్థ మోన్‌శాంటోలో ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. ఎల్పీయూలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌(ఆగ్రోనమీ) చివరి సంవత్సరం చదువుతున్న కవిత.. బేయర్స్‌ కంపెనీ అనుబంధ సంస్థ అయిన మోన్‌శాంటో కెనడా విభాగంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఉద్యోగాన్ని పొందారు. ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం కవితకు మోన్‌శాంటో ప్రతినిధులు ఉద్యోగాన్ని ఆఫర్‌ చేశారు. మోన్‌శాంటోలో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న కవిత.. ఎల్పీయూ అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కల నిజమైనట్టుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

తమ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం​ సంపాదించడం పట్ల లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ అమన్‌ మిత్తల్‌ సంతోషం వ్యక్తం చేశారు. మంచి ప్యాకేజీలు రావన్న కారణంతో అగ్రికల్చర్‌ కోర్సులను చదివేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదని, ఏడు అంకెల వేతనం దక్కడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కవిత ఫమన్‌ విజయంతో వ్యవసాయ విద్యకు పోత్సాహం పెరుగుతుందని ఎల్పీయూ అగ్రికల్చర్‌ విభాగం అధిపతి డాక్టర్‌ రమేశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు