విషాదం: ఆక్సిజన్‌ లేక కోవిడ్‌ బాధితులు మృతి

31 May, 2020 14:20 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌తో పోరాడి బాధితులు మృత్యు ఒడికి చేరుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో వైద్య సదుపాయం అందక ప్రాణాలను వదులుతున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ సదుపాయంలేక కేవలం గంటన్నర వ్యవధిలో ఏడుగురు కోవిడ్‌ బాధితులకు మృతి చెందారు. ఈ విషాద ఘటనకు ముంబైలోని జోగేశ్వరీ ఆస్పత్రి వేదికైంది.  దీంతో రెండు వారల్లో ఇదే  ఆస్పత్రిలో ఆక్సిజక్‌ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన కోవిడ్‌ బాధితుల సంఖ్య 12కి చేరింది. (ఒక్క రోజే 8,380 కరోనా కేసులు)

ఆస్పత్రి నర్సు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్పిటల్‌లో వసతులకు మించిన కోవిడ్‌ బాధితులు ఉన్నారు. దీనికితోడు సీనియర్‌ వైద్యుల కొరత, ఆక్సిజన్‌ లేని కారణంగా గడిచిన రెండు వారాల్లో 12 మంది మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ఏడుగురు కోవిడ్‌ బాధితులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఆక్సిజన్‌ కూడా అందుబాటులో లేదు. దానికి తోడు ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరు. ఈ క్రమంలోనే ఆక్సిజన్‌ కోసం పరితపిస్తూ ఏడుగురు ప్రాణాలను వదిలారు.’ అని తెలిపారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు మాట్లాడుతూ.. తమ వద్ద సరైన సదుపాయాలు లేవని బాధితులకు తాము ముందే చెప్పామని తెలిపారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎవరైనా మృతి చెందితే తమను నిందించవద్దని కూడా ముందే వివరించినట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 66వేలకు దాటింది. (ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు