వివాదాస్పద చిత్రాలతో ఇరకాటంలో పడ్డ లయోలా కాలేజీ

22 Jan, 2019 09:42 IST|Sakshi

చెన్నై : చెన్నై లయోలా కాలేజీలో నిర్వహించిన ఓ ఆర్ట్‌ ఫెస్టివల్‌ వివాదాస్పదంగా మారింది. ఈ నెల 19, 20 తేదిల్లో కాలేజీలో ‘స్ట్రీట్‌ అవార్డ్‌ ఫెస్టివల్‌’ పేరుతో ఆర్ట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ‘అక్మే బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించడం కోసం ఉద్దేశించిన ఈ ఫెస్టివల్‌ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలు, వాటి క్యాప్షన్‌లు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని కించపరిచేలా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలకు ‘భారత్‌ మాతా కూడా మీటూ బాధితురాలే’, ‘రచయిత గౌరీ లంకేష్‌ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉంది’, ‘పీఎం మోదీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తారు’ అంటూ వివాదాస్పద క్యాప్షన్లు పెట్టారు.

దాంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా ఆనంద్‌ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘స్ట్రీట్‌ అవార్డ్‌ ఫెస్టివల్‌’ అని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. స్ట్రీట్‌ అవార్డ్స్‌ అంటే.. మన జాతీయ చిహ్నాలను.. దేశ ప్రధానిని అవమానించడమేనా’ అని ప్రశ్నించారు. మరో బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. ‘లయోలా కాలేజీ కేంద్రం నుంచి నిధులు పొందుతుంది. కానీ ఇక్కడ లౌకిక భావనను పూర్తిగా దెబ్బ తీస్తున్నారు. జాతీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాక ‘ఒక వేళ కాలేజీ యాజమాన్యమే ఇలాంటి కార్యకలపాలను ప్రోత్సాహిస్తుందని తెలిస్తే.. కేంద్రం నుంచి కాలేజికి వచ్చే నిధులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరతామ’ని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణాన్ని తప్పుడు కార్యక్రమాల కోసం దుర్వినియోగం చేసినందుకు తాము ఎంతో బాధపడుతున్నామని.. క్షమించమని కోరింది.

మరిన్ని వార్తలు