12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు

28 Aug, 2014 03:14 IST|Sakshi
12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు

న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట! కుటుంబానికి నెలకు ఒకే సిలిండర్ అన్న నిబంధనను కేంద్ర కేబినెట్ ఎత్తివేసింది. ఏడాదికి ఇస్తున్న 12 సబ్సిడీ సిలిండర్లను ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని పేర్కొంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ల కోటాను 9 నుంచి 12 సిలిండర్లకు పెంచుతూ.. నెలకు ఒకే సిలిండర్ అని నిబంధన విధించడం తెలిసిందే.
 
  ఈ విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేబినెట్ గుర్తించినట్లు టెలికం, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ భేటీ అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘కొన్నిసార్లు ప్రజలకు ఒక్క సిలిండర్ కూడా అవసరం ఉండదు. పండుగల్లో మాత్రం చాలా కావాల్సి ఉంటుంది. దీంతో ఒక నెల సిలిండర్ తీసుకోకపోతే అది పోయినట్లేనని భావన నెలకొంది. దేశ ప్రజల మేలు కోసం కేబినెట్ భేటీలో ఈ నిబంధనను ఎత్తివేశాం’ అని తెలిపారు. ఇకపై ఢిల్లీలో 12 సబ్సిడీ సిలిండర్లను ఏడాదిలో ఎప్పుడైనా సరే రూ.414 చొప్పున, సబ్సిడీయేతర సిలిండర్‌ను మార్కెట్ రేటు రూ. 920కు కొనుక్కోవచ్చన్నారు.  
 
 జపాన్‌తో ఆరోగ్య ఒప్పందానికి ఒకే...
 ఆరోగ్య రంగంలో జపాన్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిసింది. ప్రభుత్వ ఆరోగ్య బీమా వ్యవస్థ అనుభవాలు, మానవ వనరుల అభివృద్ధి ద్వారా సార్వత్రిక ఆరోగ్య సదుపాయాల కల్పనకు ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోడీ త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు