‘ఉజ్వల స్కీమ్‌’కు మరింత సబ్సిడీ!

16 Aug, 2019 18:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల స్కీమ్‌’ కింద ఇప్పటి వరకు దేశంలోని 7.30 కోట్ల పేద కుటుంబాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేశారు. 2020 సంవత్సరం నాటికి దేశంలోని ఎనిమిది కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యంలో ఇప్పటికే 91.25 లక్ష్యాన్ని సాధించింది. కనుక మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మరెంతో సమయం పట్టదు. ఇన్ని కోట్ల గ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేసినప్పటికీ గత రెండేళ్ల కాలంలో దేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల వినియోగం పెరిగింది మాత్రం 0.8 శాతం మాత్రమే. పెరిగిన వినియోగదారుల సంఖ్య కూడా ఆరు శాతమే. ఇలా ఎందుకు జరుగుతోంది ? 

ఉజ్వల స్కీమ్‌ కింద వంట గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న వారిలో ఎక్కువ మంది గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేయడం లేదనేది సులభంగానే అర్థం అవుతోంది. ఉజ్వల స్కీమ్‌ కింద వినియోగదారులంతా కలిసి ఏడాదికి తలసరి 3.4 శాతం సిలిండర్లు వినియోగిస్తున్న ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. ‘కొలాబరేటివ్‌ క్లీన్‌ ఏర్‌ పాలసీ సెంటర్‌’ ప్రకారం వీరు తలసరి కనీసం తొమ్మిది సిలిండర్లు వినియోగించాలి. మరి ఎందుకు వినియోగించడం లేదు. గ్యాస్‌ సిలిండర్ల ఖరీదును భరించలేక వారంతా ఇప్పటికీ వంట చెరకు, పిడకలపైనే ఆధారపడి వంట చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీదుండే ఐదొంతుల గ్రామీణ ప్రజల్లో రెండొంతుల మంది బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నారు. వారిలో 85 శాతం మంది ఇప్పటికీ సంప్రదాయ వంట చెరకునే వాడుతున్నారని ‘ఇండియా స్పెండ్‌’ పరిశోధన సంస్థ వెల్లడించింది. 

వంట కోసం కట్టెలు, పిడకలు, ఊక ఉపయోగించడం వల్ల రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. మొత్తం కాలుష్యంలో వీటి వాటా 25 నుంచి 30 శాతం ఉంటుంది. వంట కాలుష్యం వల్ల ఏటా 4,80.000 మంది అకాలంగా మరణిస్తున్నారన్నది క్లీన్‌ ఏర్‌ పాలసీ సెంటర్‌ అంచనా. వంట గ్యాస్‌ను ఉపయోగించడం ఈ అకాల మరణాలను సులభంగా అడ్డుకోవచ్చు. ఈ పేద వినియోగదారుల ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ను కచ్చితంగా పంపించడం వల్ల ఒక్కొక్క వినియోగదారుడి ఆరోగ్యం ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 3,800 నుంచి 1,800 రూపాయల వరకు ఆదా చేయవచ్చు.

వంటగ్యాస్‌ సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చు పెడుతున్న మొత్తం 2019–20 బడ్జెట్‌ అంచనాల ప్రకారం 32,989 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్జు పెడుతున్నా ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరం. ఉజ్వల స్కీమ్‌ కింద పేద వినియోగదారుడికి సిలిండర్‌కు ఆరేడు వందల రూపాల భారం పడుతోంది. అది ఏ నాలుగు వందల రూపాయల లోపల వస్తేగానీ, అంటే 350 రూపాయలకు వస్తేనేగానీ ఆ వినియోగదారుడు కొనుగోలు చేయడానికి సాహసించలేడు. అందుకని ఈ మేరకు పేదలపై సిలిండర్‌ సబ్సిడీని పెంచి, మిగతా వినియోగదారులపై తగ్గించాలని ‘సీసీఏపీసీ’ కేంద్రానికి సిఫార్సు చేసింది. 

మరిన్ని వార్తలు