గ్యాస్ సబ్సిడీ.. ఇక కిలోకు రూ. 20!

12 Nov, 2014 07:52 IST|Sakshi
గ్యాస్ సబ్సిడీ.. ఇక కిలోకు రూ. 20!

వంటగ్యాస్ సబ్సిడీకి నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది. కిలోకు రూ. 20 చొప్పున మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల వినియోగదారులకు అదనపు భారం ఏమీ పడబోదు. అయితే, అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగితే మాత్రం అప్పుడు ఆ భారాన్ని వినియోగదారుల మీదకు నెడతారా, లేదా చమురు కంపెనీలను భరించమంటారా అనేది నిర్ణయించుకోవాలి. కిలోకు 20 రూపాయల లెక్కన గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్ని కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

పెద్ద సిలిండర్లు కొనలేక, చిన్న సిలిండర్లకు సబ్సిడీ రాక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. షాంపూల లాంటి వాటిని చిన్న సాచెట్లలో ఇస్తున్నట్లే.. ఐదు కిలోల సిలిండర్లను పంపిణీ చేయాలని, వాటికి కూడా కిలో లెక్కన సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ కేవలం 14.2 కిలోల సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఈ చర్య వల్ల దిగువ మధ్యతరగతి, పేద ప్రజలకు ఉపయోగం ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు