కేన్సర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

21 Mar, 2016 17:13 IST|Sakshi

లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో సోమవారం ఓ ప్రైవేట్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. చండీఘడ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక నగరం షేర్‌పూర్‌ ప్రాంతంలో మోహన్‌ దాయి కేన్సర్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో రోగులు ఉన్న గదుల్లోకి మంటలు వ్యాపించడంతో చిన్నారులు సహా 130 మంది రోగులు, ఆస్పత్రి సిబ్బందిని అక్కడి నుంచి తరలించామని, అందరూ క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.

అత్యవసర చికిత్స విభాగంలో ఉన్న రోగుల్లో ముగ్గురిని మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు తరలించినట్టు తెలిపారు. ఈ రోజు ఉదయం తొలుత ఆస్పత్రిలోని లాబొరేటరీలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తునా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది విశ్వయత్నం చేసిన ఫలితం లేకపోయింది. చివరికి అగ్నిమాపక బ్రిగేడ్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు