తెరచాటు బంధానికి ప్రతీకా?

25 Oct, 2018 02:38 IST|Sakshi

సీబీఐ చీఫ్‌గా చంద్రబాబు సన్నిహితుడైన నాగేశ్వరరావును నియమించడంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ

మోదీ, బాబు మధ్య కొనసాగుతున్నది ఉత్తుత్తి యుద్ధమేననేందుకు నాగేశ్వరరావు నియామకమే రుజువంటున్న విశ్లేషకులు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్‌గా నాగేశ్వర రావు నియామకం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సీబీఐలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాల మధ్య విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ సెలవుపై పంపిన ప్రభుత్వం.. సీబీఐ కొత్త డైరెక్టర్‌గా జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న ఎం నాగేశ్వర రావును నియమించింది. సీనియారిటీలో తనకన్నా ముందున్న అధికారి ఏకే శర్మను కాదని, నలుగురు జాయింట్‌ డైరక్టర్లలో ఒకరైన, చెన్నై జోన్‌ బాధ్యతలు చూస్తున్న నాగేశ్వర రావుకు కీలక బాధ్యతలు అప్పగించడంపై న్యూఢిల్లీ రాజకీయ వర్గాల్లో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

నాగేశ్వర రావుపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని.. ఇప్పటికే అలోక్‌వర్మ, అస్థానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్న సీబీఐ చీఫ్‌గా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారిని అధిపతిగా నియమించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ కూడా ఇవే అంశాలను లేవనెత్తుతూ.. ‘నాగేశ్వర రావుపై వచ్చి న అవినీతి ఆరోపణలపై డైరెక్టర్‌ హోదాలో విచారణ జరిపిన అలోక్‌ వర్మ.. నాగేశ్వర రావును సీబీఐ నుంచి తొలగించి, ప్రాసిక్యూట్‌ చేయాలని చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు సిఫారసు చేశారు. కానీ సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి అంతర్గత విచారణ, వ్యక్తిత్వ మదింపు జరపకుండానే నాగేశ్వర రావును నియమించడాన్ని సీబీఐలోనే కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది పక్కా రాజకీయ నియామకమేనని స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు, నాగేశ్వర రావు నియామకం వెనుక రాజకీయ కోణం ఒకటి బయటపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు, పార్టీలోని కొందరు కీలక నేతలకు నాగేశ్వర రావు అత్యంత సన్నిహితుడని పేరు. టీడీపీలోని కొందరు నేతలపై అవినీతి ఆరోపణలున్నాయి. విచారణ దశలో పలు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి సన్నిహితుడైన అధికారిని అత్యున్నత దర్యాప్తు సంస్థకు చీఫ్‌గా కేంద్రం నియమించడంలో లోగుట్టేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రంపై, ప్రధాని మోదీపై అవకాశం లభించిన ప్రతీసారి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం వెనక మతలబేంటనే చర్చ జరుగుతోంది.

‘మోదీ– బాబు వార్‌ ఉత్తుత్తి యుద్ధమే.. పై పై ప్రచారమే.. అవసరమైతే, అవకాశం లభిస్తే మోదీతో కలిసి నడిచేందుకు బాబు సిద్దంగానే ఉంటారు. పట్టువిడుపులకు మోదీ కూడా రెడీనే. సీబీఐ చీఫ్‌గా నాగేశ్వర రావు నియామకం దీన్నే రుజువు చేస్తోంది’ అని ఢిల్లీ– అమరా వతి రాజకీయాలపై పట్టున్న ఓ రాజకీయ విశ్లేషకు డు అన్నారు. ‘మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు లభించే ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోడని, నాగేశ్వర రావు నియామకంపై విపక్షాలు పెద్దగా రాద్ధాంతం చేస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరెత్తకపోవడం అందులో భాగమేనని, సయోధ్య కోసం బీజేపీ ఒక అడుగేస్తే.. బాబు నాలుగడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చేసిన వ్యాఖ్య గమనార్హం.

చదవండి: ఆపరేషన్‌ ‘ఎల్లో’.. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్టకు టీడీపీ కుట్ర!

>
మరిన్ని వార్తలు