కుటుంబంలోని 25మందికి 10 కంటే ఎక్కువ వేళ్లు​

18 Sep, 2019 14:40 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బేతుల్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 25 మందికి కాళ్లకు, చేతులకు దాదాపు 10కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. ఈ అరుదైన జన్యు క్రమరాహిత్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికి.. ఆ గ్రామానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులందరికీ పాలిడాక్టిలీ అనే జన్యులోపం ఉందని.. ఫలితంగా ప్రతీ ఒక్కరికీ 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయన్నారు. ఈ అరుదైన సమస్య వల్ల చదువు పూర్తి చేయలేకపోవడమే కాక.. మంచి ఉద్యోగాన్ని కూడా పొందలేకపోతున్నామని సదరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యుడైన బల్దేవ్‌ యావలే మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో దాదాపు 25 మంది సభ్యులున్నారు. అందరికి కాళ్లకు, చేతులకు 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. దీని వల్ల మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. స్కూల్‌లో ఇతర పిల్లలు మా పిల్లలను ఎగతాళి చేస్తున్నారు. కాళ్లకు 10కంటే ఎక్కువ వేళ్లు ఉండటంతో.. సరైన చెప్పులు, షూలు దొరకడం లేదు. ఫలితంగా మాకు సరైన ఉద్యోగం లభించడం లేదు. మేం చాలా పేదవాళ్లం. మాకు భూమి కూడా లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి’ అని కోరాడు. యావలే కుమారుడు సంతోష్‌ మాట్లాడుతూ.. ‘నాకు చేతులకు 12, కాళ్లకు 14 మొత్తం 26 వేళ్లు ఉన్నాయి. దీనివల్ల నాకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. గ్రామ పంచాయతీ నుంచి కూడా నాకు ఎలాంటి సాయం లభించడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని’ విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు