వీడియో వైరల్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే క్షమాపణలు

15 Nov, 2019 19:15 IST|Sakshi
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బైజ్నాత్‌ కుష్వాహా (ఫైల్‌ ఫోటో)

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగి వచ్చిన ఎమ్మెల్యే క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. సబల్‌గర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బైజ్నాత్‌ కుష్వాహా గురువారం ఓ ప్రైవేట్‌ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు నాలుగు మంచి మాటలు చెబుతూ మద్యం వల్ల కలిగే దుష్పరిమాణాలను వివరించారు. దీనికి ఉదాహరణగా.. ‘ఢిల్లీ రాజు ఫృథ్వీరాజ్‌ చౌహాన్‌, మహోబా రాజు పరిమల్‌, కనౌజ్‌ రాజు జయచంద్‌లు మద్యానికి అలవాటుపడి తమ రాజ్యాలను పోగొట్టుకున్నారు. వాళ్లు నిర్మించిన కోటలలో ఇప్పుడు గబ్బిలాలు తిరుగుతున్నాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అనంతరం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలై విమర్శలు రావడంతో.. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా’నంటూ ప్రకటించారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. చరిత్రలోని గొప్ప రాజులు, నాయకులు, వ్యక్తుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులకు గాంధీ కుటుంబసభ్యులు తప్ప వేరే వాళ్లు గొప్పగా కనపడరని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు బయట చెబితే సరిపోదని, సదరు ఎమ్మెల్యే ఆ పాఠశాలకే వెళ్లి తాను ప్రసంగించిన విద్యార్థుల ముందు క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేశారు. ఈ ఉదంతంపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది స్పందిస్తూ.. కుష్వాహా ఇప్పటికే క్షమాపణలు చెప్పినందున బీజేపీ డిమాండ్‌లో అర్థం లేదని కొట్టిపారేశారు.  

మరిన్ని వార్తలు