మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి రాజీనామా

5 Jul, 2013 20:55 IST|Sakshi
రాఘవ్‌జీ

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ(79) శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాఘవ్‌జీ ఇంట్లో నాలుగేళ్లుగా రాజ్‌కుమార్ డంగీ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
 

గురువారం రాత్రి హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌కుమార్ తనను సహజవిరుద్ధంగా సెక్స్‌లో పాల్గొనాలని రాఘవ్‌జీ ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. ఒక అఫిడవిట్‌ను కూడా సమర్పించిన అతను.. రాఘవ్‌జీ ఒక మహిళతో శృంగారంలో పాల్గొన్న దృశ్యాల సీడీని పోలీసుకు అందించాడు. రాజ్‌కుమార్ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


దీనిపై రాజకీయ దుమారం రేగడంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కలుగజేసుకుని రాఘవ్‌జీని రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. దీంతో రాఘవ్‌జీ తన పదవికి రాజీనామా చేశారు. రాఘవ్‌జీ రాజీనామా నేపథ్యంలో నీటి పారుదల శాఖా మంత్రి జయంత్ మలయ్యాకు ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు.
 

రాజీనామా వ్యవహారంపై రాఘవ్‌జీ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి సూచన మేరకు పదవికి రాజీనామా చేశా. అతను(రాజ్‌కుమార్) నా మీద ఏ విధమైన ఆరోపణలు చేశాడనే విషయం నాకు తెలియదు. అతను చెసిన ఆరోపణలన్నీ అబద్ధమే. నా ప్రతిష్టను దిగజార్చేందుకు జరగుతున్న కుట్ర ఇది’’ అని చెప్పారు.
 

రాజ్‌కుమార్ ఆరోపణలు అవాస్తవమని, తన భర్తను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని రాఘవ్‌జీ భార్య హీరాబెన్ ఆరోపించారు. రాఘవ్‌జీ కుమార్తె జ్యోతి షా కూడా తన తండిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కాగా, రాఘవ్‌జీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఇది సిగ్గుమాలిన చర్యని, ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తలు