వర్షాలు పడాలని పెళ్లి చేశారు.. ఆగిపోవాలని విడాకులు

12 Sep, 2019 09:32 IST|Sakshi

భోపాల్‌: సాధారణంగా మన దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవడం కోసం కప్పలకు వివాహం చేయడం చూస్తుంటాం. ఒక వేళ కుండపోత వర్షాలు కురుస్తుంటే.. వరదలతో బీభత్సం సృష్టిస్తుంటే అప్పుడేం చేయాలి. ఏం చేయాలో తెలియాలంటే భోపాల్‌ వెళ్లాలి. ప్రస్తుతం భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌ తడిసిముద్దవుతన్న సంగతి తెలిసిందే. అయితే వర్షాకాలం ప్రారంభంలో రాష్ట్రంలో పరిస్థితి ఇలా లేదు. ముఖ్యంగా రాజధాని భోపాల్‌లో తీవ్ర నీటి ఎద్దడి. తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. దాంతో భోపాల్‌ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గడిచిన 24 గంటల్లో భోపాల్‌లో 48మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దాంతో డ్యామ్‌లన్నింటిని తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలను ఆపేందుకు ఓ వినూత్న ప్రయోగం చేశారు భోపాల్‌ ప్రజలు. గతంలో వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేస్తే.. నేడు వర్షాలు ఆగిపోవాలని ఆ కప్పల జంటకు విడాకులు ఇప్పించారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. కుండపోత వర్షాలను ఆపేందుకు ఇంద్రపూరి ప్రాంతానికి చెందిన శివ్‌ సేవా శక్తి మండల్‌ సభ్యులు గతంలో తాము పెళ్లి చేసిన కప్పలను విడదీశారు. వేదమంత్రాల సాక్షిగా, వైభవంగా ఈ వేడుక నిర్వహించడం గమనార్హం.

మరిన్ని వార్తలు