రెండు నెలలుగా కొనసాగుతున్న వైనం

14 Mar, 2019 11:21 IST|Sakshi

భోపాల్‌ : తండ్రి చనిపోయి రెండు నెలలు అవుతోంది. వైద్యులు డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. కానీ తండ్రి మృతదేహానికి రెండు నెలలుగా ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నాడో కొడుకు. అతను ఏదో సాధరణ పౌరుడైతే సమస్య లేదు. కానీ సదరు వ్యక్తి ఐపీఎస్‌ అధికారి కావడం గమనార్హం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర మిశ్రా అనే ఐపీఎస్‌ అధికారి తండ్రి(84) ఈ ఏడాది జనవరి 14న మరణించాడు. ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బంది డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. కానీ రాజేంద్ర కుమార్‌ మాత్రం రెండు నెలలుగా ప్రభుత్వ బంగళాలో తండ్రి మృతదేహానికి చికిత్స చేయిస్తున్నాడు. తల్లి, సోదరులతో పాటు వైద్యం చేసే వ్యక్తిని మాత్రమే ఆ గదిలోకి అనుమతిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మానవహక్కుల కమిషన్‌ రాజేంద్ర ఇంటికి వైద్యులను పంపి.. పరీక్షించడానికి ప్రయత్నించింది. కానీ అతను అందుకు ఒప్పుకోలేదు.

ఈ విషయం గురించి రాజేంద్ర మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచంలో శాస్త్రానికి అందని విషయాలు చాలా ఉన్నాయి. అల్లోపతి వైద్యమే ఆఖరు కాదు. మా నాన్న ఆరు దశాబ్దాలుగా యోగా చేస్తున్నారు. ఆయన యోగింద్రుడు. ఒక వేళ మీరు ఆరోపిస్తున్నట్లు మా నాన్న మరణించాడనే అనుకుందాం. మరి ఇప్పటి వరకూ ఆయన శరీరం ఎందుకు కుళ్లిపోలేదు. మృతదేహానికి వైద్యం చేయడం అసాధ్యం. కానీ మా నాన్న శరీరం వైద్యానికి స్పందిస్తుంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం పంపే డాక్టర్లు ఆయనను మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి.. ఆయనకు ఏమైనా అయితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు. అలాంటిది జరిగితే.. దాన్ని హత్య అంటూ కేసు పెట్టవచ్చా’ అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజేంద్ర తల్లి.. ఈ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా చూడమంటూ.. ఇప్పటికే మానవ హక్కులు కమిషన్‌ను ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు