విద్యార్థులకు ‘హింగ్లీష్‌’ భాషలో పరీక్షలు..

1 Jun, 2018 16:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : మీరు పరీక్షలు ఏ భాషలో రాస్తారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును మీరు పరీక్షలను ఏ భాషలో రాస్తారు. సాధారణంగా స్థానిక భాషలో లేదా ఆంగ్లంలో పరీక్షలకు హాజరవుతాం. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ విశ్వవిద్యాలయం మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక భాష అయిన హిందీతో పాటు ఇంగ్లీష్‌ను కలిపి పరీక్షలో రాయొచ్చని ప్రకటించింది.

హిందీ, ఇంగ్లీష్‌ భాషలను కలిపి ‘హింగ్లీష్‌’లో పరీక్ష రాసేందుకు మధ్యప్రదేశ్‌ మెడికల్‌ సైన్స్‌ యూనివర్సిటీ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మౌఖిక పరీక్షల్లో సైతం హింగ్లీష్‌లో సమాధానాలు చెప్పవచ్చని పేర్కొంది. దీనిపై యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆర్‌ఎస్‌ శర్మ స్పందిస్తూ.. తమ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఉదాహరణకు ‘హార్ట్‌ అటాక్‌’ అనే పదానికి బదులు పరీక్షలో ‘హార్ట్‌ కా దౌరా’ అని రాయవచ్చని వివరించారు. గ్రామీణ  ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. చాలా మంది విద్యార్థులకు సరైన సమాధానం తెలిసినప్పటికీ వ్యక్తికరించలేకపోతున్నారని ఇది వారికి మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ పరిధిలోని 312 కాలేజీల్లో ఈ నిబంధన వర్తించనున్నట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు