ఇక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు ఉండవు..!

11 Dec, 2019 16:59 IST|Sakshi

భోపాల్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్లపై నిషేధం విధించడాన్ని మధ్యప్రదేశ్‌ పౌర సంబంధాల మంత్రి పీసీ శర్మ సమర్థించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మధ్యప్రదేశ్‌లోని గుజరాతి, జైన్‌, సింధ్‌ మతాల సమాఖ్యలు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సనాతన పద్ధతులను పాటించి పెళ్లిళ్లు జరిగితే బాగుంటుందని మంత్రి శర్మ అభిప్రాయపడ్డారు. అప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక సామాజిక కోణంలోనే నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు ఆయా మత సమాఖ్యల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇకపై ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు ఉండవని పేర్కొంటూ ఇటీవల ఇక్తాత్‌ (ఉత్తర్వు) కూడా జారీ చేశారు. 

గుజరాతి సమాజ్‌ జాతీయ కార్యదర్శి సంజయ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు సరైనవి కావు. ఈ రోజుల్లో పెళ్లైన మూణ్నాళ్లకే దంపతులు విడిపోతున్నారు. అలాంటిది పెళ్లికి ముందే ఫొటోలు, వీడియోలు మంచి పద్ధతి కాదు. అందుకే గుజరాతి సమాజ్‌ కార్యనిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది’అని వెల్లడించారు. తమ మతాచారాలకు విఘాతం కలిగించేదిగా ఉంది కాబట్టే ప్రీ వెడ్డింగ్‌ షూట్లను బ్యాన్‌ చేశామని జైన్‌, సింధ్‌ సమాజ్‌ అధ్యక్షులు తెలిపారు. కాగా, ప్రీ వెడ్డింగ్‌ షూట్లపై నిషేధం విధిస్తూ గతేడాది చత్తీస్‌గఢ్‌ సింధ్‌ సమాఖ్య కూడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు