‘రాత్రయితే తాగుడే.. లేదంటే కుదరదే..!’

11 Jan, 2020 12:35 IST|Sakshi

భోపాల్‌ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు పెంచేందుకు సీఎం కమల్‌నాథ్‌ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గోపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మద్య నిషేదం చేసేందుకు తాను వ్యతిరేకమని.. మనిషికి నచ్చిన మద్యం సేవించేందుకు అడ్డుచెప్పొద్దని ఆయన పేర్కొన్నారు. ఒక మనిషి తనకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు, నచ్చిన మద్యాన్ని తాగేందుకు స్వతంత్ర భారత్‌లో అన్ని హక్కులు కలిగి ఉన్నాడని మంత్రి సెలవిచ్చారు. ఎవరి బలవంతం మీదనో ప్రజలు మందు కొట్టరని.. అలాంటప్పుడు మందు తాగొద్దని ఎవరినీ కట్టడి చేయలేమని అన్నారు. 

‘రాత్రి పూట ఒక పెగ్‌ వేయనిదే కుదరదు. రోజూరాత్రి ఒక్క గ్లాస్‌ మందు కూడా తాగకుంటే ఆ మరుసటి రోజంతా అదోలా ఉంటుంది. ఈ సంగతి నా మిత్రుడొకరు చెప్పారు’అని గోపాల్‌ సింగ్‌ తెలిపారు. శారీరకంగా, మానసికంగా తగిలిన గాయాల్ని మాన్పడానికి చాలామంది మద్యం సేవిస్తారని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్ల సలహామేరకు రోజూ పెగ్గు వేయాల్సిందేనని ఎంతోమంది చెప్పినట్టు ఆయన వెల్లడించారు.కాగా, మద్యం దుకాణాలను పెంచాలనే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేస్తే.. మధ్యప్రదేశ్‌ కాస్తా.. మదిర(మద్యం)ప్రదేశ్‌ అవుతుందని ఎద్దేవా చేశారు.​

మరిన్ని వార్తలు