రూ.25వేల లంచం డిమాండ్‌.. బదులుగా గేదె

12 Sep, 2019 10:45 IST|Sakshi

భోపాల్‌: సాధరణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే ఏ పని జరగదనేది జనమేరిగిన సత్యం. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దోగొప్పో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఉన్నదే ప్రజలకు సేవ చేయడం కోసం అనే విషయాన్ని జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సామాన్యుల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. దాంతో లంచాలు అడిగే ఆఫీసర్లకు తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాతికవేలు లంచం డిమాండ్‌ చేసిన ఓ అధికారికి తగిన గుణపాఠం చెప్పాడో రైతు. వివరాలు.. విదిషా ప్రాంతం సిరోంజ్‌ జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్‌కు, ఇతర కుటుంబ సభ్యులతో భు వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు.

సిద్ధార్థ సింగాల్‌ అక్కడ తహసీల్దార్‌గా పని చేస్తున్నాడు. భూపేంద్ర సమస్య తెలుసుకుని, దాన్ని పరిష్కరించాలంటే రూ. 25 వేలు లంచం ఇవ్వాలన్నాడు. అందుకు భూపేంద్ర పేదవాడిని అంత సొమ్ము ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. కానీ సిద్ధర్థ మనసు కరగలేదు. ఇలా గత 6 నెలలుగా భూపేంద్ర తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ పని మాత్రం కావడం లేదు. తహసీల్దార్‌ ప్రవర్తనతో విసిగిపోయిన భూపేంద్ర రెండు రోజుల క్రితం తన గేదెను తీసుకువచ్చి సిద్ధార్థ కారుకు కట్టేశాడు. ఆశ్చర్యపోయిన జనాలు ఎందుకిలా చేశావని ప్రశ్నించగా.. అధికారులు కోరిన లంచం ఇవ్వలేనని.. తన గేదెను తీసుకెళ్లమని చెప్పాడు.

విషయం కాస్త బయటకు పొక్కడంతో తహసీల్దార్‌ సిద్ధార్థ కాళ్ల బేరానికి వచ్చాడు. లంచం వద్దు ఏం వద్దు గేదెను తీసుకెళ్లాల్సిందిగా భూపేంద్రను కోరాడు. కానీ భూపేంద్ర ముఖ్యమంత్రి, జిల్లా అధికారికి ఓ మెమరాండం అందజేసిన తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం కాస్తా మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందిచారు. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు