తహసీల్దార్‌కు లంచంగా గేదెను ఇచ్చిన మహిళ

9 Jan, 2020 16:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : లంచం అడిగిన తహసీల్దార్‌కు ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. లంచంగా తన ఇంటిలో ఉన్న గేదెను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు..నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ ..పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పని కావాలంటే రూ. 10వేలు లంచం ఇవ్వాలని  తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు అడిగారు. దీంతొ సదరు మహిళ అప్పు చేసి మరీ రూ.10వేలు లంచం అప్పజెప్పింది. అయినప్పటికీ ఆమె పని కాలేదు.

కొద్దిరోజుల తర్వాత మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. ఇంకా పని కాలేదని, మ్యుటేషన్‌ చేయాలంటే మరో రూ.10వేలు లంచంగా ఇవ్వాలన్నారు. లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తన గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. లంచంగా తన గేదెను తీసుకొని తన పేరుపై మ్యుటేషన్‌ చేయాలని కోరింది. లంచం అడిగిన విషయం అందరికీ తెలియడంతో తహసీల్దార్‌ అధికారులు ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నారు. అంతేకాదు నాలుగు రోజుల కిత్రమే మహిళ పేరున మ్యుటేషన్ చేశామని , తమను అల్లరి చేసేందుకే మహిళ కుట్ర పన్ని కార్యాలయానికి గేదెను తెచ్చిందని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు. కాగా, మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఎమ్మారో కార్యాలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు