హలో చెన్నై.. హ్యాపీ మద్రాస్‌ డే

22 Aug, 2018 18:51 IST|Sakshi

చెన్నై మహా నగరానికి 379 ఏళ్లు పూర్తి

సాక్షి, చెన్నై : 379 ఏళ్ల క్రితం ఓ చిన్న కుగ్రామంలా ఏర్పడిన మద్రాస్‌ నేడు దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. నాడు బ్రిటిష్‌ పాలకులు నాటిన మద్రాస్‌ మొక్క నేడు మహావృక్షమై విలసిల్లుతోంది. మద్రాస్‌ నగరం ఏర్పడి నేటికి 379 ఏళ్లు పూర్తయ్యాయి.. 1639 ఆగస్ట్‌ 22న నాటి బ్రిటిష్‌ అధికారి ప్రాన్సిస్‌ డే మద్రాస్‌ నగరాన్ని నిర్మించారు. ఆ తరువాత అదే నగరం బ్రిటిష్‌ వారికి దక్షిణ భారతంలో అతిపెద్ద వర్తక స్థావరంగా మారింది. దేశంలో 1608లో వర్తకం ప్రారంభించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ మద్రాస్‌లో సెయింట్‌ జార్జ్‌కోట ద్వారా అధికారికంగా పరిపాలన కొనసాగించింది. భారత దేశంలో బ్రిటిష్‌ వాళ్లు నిర్మించిన మొట్టమెదటి కట్టడం సెయింట్‌ జార్జ్‌కోటనే కావడం విశేషం. 1689లో దేశంలో తొలి మున్సిపాలిటీగా గుర్తింపుపొంది.. బ్రిటిష్‌ వర్తకానికి  కీలక స్థావరంగా మారింది.

చెన్నపట్నంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, మద్రాస్‌పట్నం, మద్రాస్‌గా మారి చివరికి చెన్నైగా పేరొందింది.  బ్రిటిష్‌ పాలనలో  తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలతో కలుపుకుని మద్రాస్‌ ప్రెసిడెన్సీగా గుర్తింపు పొందింది. దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరువాత నాలుగు రాష్ట్రాలుగా విడిపోయి.. మద్రాస్‌ రాష్ట్రానికి రాజధానిగా మారింది. ఆ తరువాత మద్రాస్‌ పేరును 1969లో తమిళనాడుగా మార్చగా.. 1996లో రాజధాని పేరును చెన్నైగా మార్చారు.

దేశంలో ద్రవిడ ఉద్యమానికి బీజాలు పడింది ఈ గడ్డపైనే. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలు మద్రాస్‌ సొంతం. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో ఎప్పుడూ వైవిద్యాన్ని చూపుతోంది మద్రాస్‌. దేశంలో ఆగ్రనాయకులుగా పేరొందిన పెరియార్‌ రామస్వామి నాయర్‌, సీ రాజగోపాల చారి, అన్నాదురై, ఎంజీఆర్‌, కరుణానిధి ఈ గడ్డపైనే ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఆగస్ట్‌ 22న చెన్నై వాసులు మద్రాస్‌ డేను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దేశ వ్యాప్తంగా మద్రాస్‌తో అనుబంధం ఉన్నవారు సోషల్‌ మీడియాలో ‘హ్యాపీ మద్రాస్‌ డే’ అంటూ శుభాకాంక్షాలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు