‘నక్కీరన్‌’ గోపాల్‌ అరెస్టును తప్పుబట్టిన మద్రాస్‌ కోర్టు

9 Oct, 2018 19:18 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ జర్నలిస్ట్‌ ‘నక్కీరన్‌’ గోపాల్‌కు మద్రాసు హైకోర్టు ఊరట కల్పించింది. గోపాల్‌కు రిమాండ్‌ విధించడానికి నిరాకరించి తమిళనాడు ప్రభుత్వానికి, చెన్నై పోలీసులకు గట్టి షాక్‌ ఇచ్చింది. తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ గురించి తప్పుడు కథనం రాశారంటూ ‘నక్కీరన్‌’ గోపాల్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్‌ ప్రతిష్టను దిగజార్చేవిధంగా గోపాల్‌ అసత్య కథనాలు రాశారంటూ రాజ్‌భవన్‌ అధికారులు ఫిర్యాదు చేయడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను తప్పుపట్టిన మద్రాసు కోర్టు గోపాల్‌కు రిమాండ్‌ విధించేందుకు నిరాకరించింది.

కాగా ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్‌ ప్రస్తుతం తమిళ మ్యాగ్‌జైన్‌ ‘నక్కీరన్‌’కు ఎడిటర్‌- ఇన్‌- చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రొఫెసర్‌ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ఈ మ్యాగజీన్‌ ప్రముఖంగా ప్రచురించింది. ఎక్కువ మార్కులు రావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో గవర్నర్‌ వద్దకు కూడా నిర్మలా దేవి విద్యార్థులను తీసుకెళ్లిందని గోపాల్‌ తన కథనంలో రాసుకొచ్చారు. అంతేకాక గవర్నర్‌ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్‌ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు