జస్టిస్‌ తాహిల్‌కు అనూహ్య మద్దతు

10 Sep, 2019 12:47 IST|Sakshi

చెన్నై: మేఘాలయ హైకోర్టుకు బదిలీ​కి నిరసనగా  రాజీనామా చేసిన  మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ కమలేష్ తాహిల్‌ రమణి  తన సహచరుల నుంచి భారీ మద్దతులభిస్తోంది.  ఆమె బదిలీని వ్యతిరేకిస్తే  వేలాది మంది న్యాయవాదులు  పోరాటాన్ని చేపట్టారు.  సోమవారం నాటి ఆందోళనకు కొనసాగించిన మద్రాస్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్‌కు చెందిన 18 వేల మంది న్యాయవాదులు మంగళవారం  కూడా  కోర్టు విధులను  బహిష్కరించారు. ప్రభుత్వ న్యాయవాదులు మాత్రమే విధులకు హాజరయ్యారు. 

జస్టిజ్‌ వీకే తాహిల్‌ రమణి బదిలీని ఖండిస్తూ సోమవారం మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టున్యాయవాదులు భోజన విరామ సమయంలో కోర్టు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆమె రాజీనామాను ఉపసంహరించుకోవాలని జస్టిస్ తాహిల్‌ రామణికి విజ్ఞప్తి చేయడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆమోదించిన సుప్రీంకోర్టు కొలీజియంకు అప్పీల్ చేయాలని న్యాయవాదులు భావిస్తున్నారు. మంగళవారం నుంచి తమ  ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నామని ప‍్రకటించారు. మరోవైపు  తాహిల్‌ రమణిని ఆమె నివాసంలో కలుసుకున్న తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. ఆమె బదిలీ అప్రజాస్వామికమనీ, ఇది న్యాయమూర్తుల స్వాతంత్ర్యాన్ని, కేసులపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుందని అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి మోహనకృష్ణన్ ఆరోపించారు.

కాగా  మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  ఉన్న తనను ఆకస్మికంగా మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ఉపసంహరించాలని  జస్టిస్‌ తాహిల్‌ సుప్రీంకోర్టు కొలీజియంకు ఇదివరకే ఆమె చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె తన పదవికి  రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ రంజన్ గొగోయ్‌కు  పంపించిన సంగతి తెలిసిందే. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది ఆగస్టు 8న ఆమె నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు