‘టిక్‌టాక్‌ మొబైల్‌ యాప్‌పై నిషేధం’

4 Apr, 2019 11:47 IST|Sakshi

సాక్షి, చెన్నై : యువత, చిన్నారుల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్‌ మొబైల్‌ యాప్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్ట్‌ ఆదేశించింది. ఈ యాప్‌తో అశ్లీల కంటెంట్‌ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చైనాకు చెందిన వీడియో షేరింగ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్‌ కురుబకరన్‌, జస్టిస్‌ ఎస్‌ ఎస్‌ సుందర్‌లతో కూడిన మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు టిక్‌టాక్‌ యాప్‌తో రూపొందిన వీడియోలను ప్రసారం చేయరాదని బెంచ్‌ మీడియా సంస్థలను కూడా ఆదేశించింది. పిల్లలు సైబర్‌, ఆన్‌లైన్‌ బాధితులు కాకుండా నిరోధించేందుకు అమెరికా తరహాలో బాలల ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌ చట్టాన్ని తీసుకువచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈ సందర్భంగా కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

చిన్నారులు తమ వీడియోలను అపరిచితులతో షేర్‌ చేసుకునే క్రమంలో ఈ యాప్‌ను వినియోగించే ప్రక్రియలో అక్కడ పొందుపరిచే అశ్లీల లింక్‌లకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా మొబైల్‌ యాప్స్‌లో చోటుచేసుకునే ప్రమాదాలను పసిగట్టకుండా మన పిల్లలపై వీటిని పరీక్షింపచేయడం దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా ఈ యాప్‌ను ఇదే కారణంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ల్లో నిషేధించారని పేర్కొంది.

మరిన్ని వార్తలు