అమ్మ.. నాన్న.. ఓ అమృత!

23 Dec, 2017 07:06 IST|Sakshi

కోర్టులో అమృతపిటిషన్‌పై విచారణ

జయ సరే శోభన్‌బాబు మాటేమిటి

అమృతను ప్రశ్నించిన న్యాయస్థానం

రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వారసుల వివాదంలో ప్రజల మదిలో ఎన్నాళ్లుగానో ఉన్న ప్రశ్నను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తే సంధించారు. తల్లి సంగతి సరే మరి తండ్రి మాటేమిటి అని బెంగళూరు యువతి అమృతను శుక్రవారం ప్రశ్నించారు.

సాక్షి, చెన్నై:  సినీనటిగా జయలలిత వెలుగొందుతున్న కాలంలో తల్లి సంధ్య అకస్మాత్తుగా కన్నుమూశారు. తల్లి తోడుకరువైన జయలలిత శోభన్‌బాబుకు చేరువైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు గుసగుసలకు పోయారు. జయ, శోభన్‌బాబుల ప్రేమఫలంగా కుమార్తె జన్మించిందని ఒక వార్త ఆనాటి నుంచి నేటికీ ప్రచారంలో ఉంది. అదేమీ లేదు.. కేవలం తల్లి మృతితో కలత చెందిన జయలలితకు తన మాటలతో శోభన్‌బాబు ఊరటనిచ్చారని కొందరు ఆ పుకార్లను కొట్టిపారేశారు. 

డీఎంకే ప్రచారాస్త్రంగా వాడుకోవడం..
రాష్ట్రంలో ఎన్నికలు జరిగినపుడల్లా శోభన్‌బాబుకు జయలలిత భోజనం వడ్డిస్తున్న ప్రయివేటు ఫొటోలను డీఎంకే ప్రచారాస్త్రంగా వాడుకోవడం, ఎన్నికలు ముగిసిన తరువాత ఆ ఆంశం అటకెక్కేయడం పరిపాటిగా మారింది. అయితే ఐదేళ్లకొకసారి వచ్చే జయ, శోభన్‌బాబు వ్యవహారం జయలలిత కన్నుమూసిన తరువాత తరచూ తెరపైకి వస్తోంది. 

మేమే వారసులం అంటూ పోటీ..
జయకు వారసులమంటూ ముగ్గురు వ్యక్తులు పోటీపడ్డారు. వీరిలో ఇద్దరు కొన్నాళ్లు మీడియా ముందుకు వచ్చి ఆ తరువాత తెరమరుగయ్యారు. 
అయితే బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి మాత్రం తానే జయ వారుసురాలినని పట్టుదలతో పోరాడుతోంది. సుప్రీంకోర్టుకు ఎక్కింది. స్థానిక న్యాయస్థానంలో ముందుగా తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు, డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమైంది. అయితే జయలలిత కన్నుమూసింది చెన్నైలో కావడంతో జయలలిత కుమార్తెగా ప్రకటించాలని కోరుతూ బెంగళూరు రామచంద్ర గ్రామానికి చెందిన ఎస్‌ అమృత, అదే ఊరికి చెందిన ఎల్‌ఎస్‌ లలిత, రంజనీ రవీంద్రనాథ్‌ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్‌ వేశారు. 

అమృత జయలలిత కూతురని..
తాము దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంధువులమని, అమృత జయలలిత కూతురని పేర్కొన్నారు. జయలలితకు తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగాల్సి ఉన్నందున అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, సీనియర్‌ న్యాయవాది ప్రకాష్‌ హాజరై అమృత డీఎన్‌ఏ పరీక్షలకు అనుమతివ్వాలని, అలాగే బంధువులు కోరిన మరో మూడు కోర్కెలను అంగీకరించాలని న్యాయమూర్తి వైద్యనాథన్‌ను కోరారు. 

ఇవన్నీ విన్న న్యాయమూర్తి మాట్లాడుతూ.. దివంగత నటుడు శోభన్‌బాబునే అమృత నాన్న అని మీరు పిటిషన్‌ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. జయలలితనే తన తల్లి అని అమృతకు ముందుగా తెలియాల్సి ఉందని న్యాయవాది బదులిచ్చారు. అడ్వకేట్‌ జనరల్‌ విజయ నారాయణన్‌ తన వాదనను వినిపిస్తూ, అమృత వేసిన పిటిషన్‌ విచారణకు అనర్హమైనదని స్పష్టం చేయాల్సి ఉందని, అప్పటి వరకు న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీచేయరాదని కోరారు. 

అనుమానాలపైనే వారంతా పిటిషన్లు వేశారు, వారి వద్ద ఆధారాలు, ఫొటోలూ ఏమీ లేవని చెప్పారు. అమృత తదితరులు వేసిన పిటిషన్‌ అర్హతపై తాము నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి బదులిచ్చారు. మరలా న్యాయవాది ప్రకాష్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా లేనప్పుడల్లా జయలలిత బెంగళూరుకు వెళ్లి పిటిషన్‌దారుల ఇళ్లలోనే ఉండేవారని, జయ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అమృత చెన్నైకి వచ్చి పోయెస్‌గార్డెన్‌ నివాసానికి వెళ్లి కలిసేవారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం, చెన్నై కార్పొరేషన్‌ బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీకి వాయిదావేశారు.
 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు