‘రూ. 570 కోట్ల’ వ్యవహారంపై సీబీఐ విచారణ

4 Jul, 2016 14:53 IST|Sakshi
‘రూ. 570 కోట్ల’ వ్యవహారంపై సీబీఐ విచారణ

తమిళనాడు ఎన్నికల సమయంలో రవాణా అవుతూ పట్టుబడిన రూ. 570 కోట్ల విషయంలో సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు  ఆదేశించింది. డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ దాఖలు చేసిన పిటిషన్కు మద్దతుగా తగిన ఆధారాలుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా సీబీఐకి కోర్టు తెలిపింది. ఆ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదంటూ చెబుతున్న అంశంలో వాస్తవికతను అనుమానిస్తూ ఇళంగోవన్ పిటిషన్ దాఖలుచేశారు. మే 16న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగగా, సరిగ్గా 13వ తేదీన ఎన్నికల కమిషన్ నిఘా బృందం తిరుపూర్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కంటెయినర్లను వెంటాడి పట్టుకుని చూడగా అందులో రూ. 570 కోట్లు ఉన్న విషయం తెలిసిందే.

ఆ కంటెయినర్లను తిరుపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం క్యాష్ చెస్ట్కు ఆ డబ్బు తరలిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అయితే, అంత పెద్ద మొత్తాన్ని తరలిస్తుంటే స్థానిక పోలీసుల ఎస్కార్టు ఉండాలని, అలా ఏమీ జరగలేదని ఇళంగోవన్ అంటున్నారు. పైగా డబ్బు తరలిస్తున్నట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు ఏమీ లేవని తెలిపారు.

>
మరిన్ని వార్తలు