న్యాయవ్యవస్థకే ఇది మచ్చవుతుంది

14 May, 2018 15:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ స్వతంత్రత నిలబడదు. ఎంత పటిష్టంగా, ఎంత వేగంగా తీర్పును వెలువరిస్తోంది అన్న అంశాలపై న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఆధారపడి ఉంటుంది. రాజకీయ, పాలనాపరమైన ప్రాధాన్యత గల కేసుల విషయంలో కూడా అంతులేని కాలయాపన చేస్తున్నప్పుడే న్యాయ వ్యవస్థపై పలు అనుమానాలు తలెత్తుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.

తమిళనాడులో 18 అసెంబ్లీ నియోజక వర్గాలు 2017, సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. పాలకపక్ష అన్నాడీఎంకే పార్టీలో అధికార సంక్షోభం ఏర్పడి 18 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్‌తో జట్టుకట్టారన్న కారణంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని అసెంబ్లీ స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించారు. ఎడపాడి పళనిస్వామి అతి తక్కువ మెజారిటీతో సభా విశ్వాసాన్ని పొందిన నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ చెల్లదని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తీర్పును వాయిదా వేస్తున్నట్టు జనవరి 23వ తేదీన ప్రకటించారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయిన సందర్భాల్లో ప్రజలకు, పాలనా వ్యవహారాలకు ఇబ్బందులు కలుగరాదన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తోంది. మరెందుకో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయి ఎనిమిది నెలలు పూర్తవుతున్న తీర్పు వెలువడ లేదు. అదే ఓ పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ విషయంలో హైకోర్టు త్వరితగతిన కేసును విచారించి త్వరగానే తీర్పును వెలువరించింది. పళనిస్వామితో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఆయనతో పన్నీర్‌ సెల్వం వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేలు కలిసిపోయారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంగా వాళ్లను సస్పెండ్‌ చేయాలంటూ విపక్షం కోర్టుకెక్కింది. 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై వేగంగా విచారణ పూర్తి చేసిన హైకోర్టు, ఇప్పటికీ పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ కేసులో తీర్పు వెలువరించక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు