విద్యార్థినులూ తస్మాత్‌ జాగ్రత్త

1 Sep, 2019 08:24 IST|Sakshi

ప్రొఫెసర్ల వద్దకు పిలిస్తే ఒంటరిగా వెళ్లొద్దు

ముందస్తు అనుమతితోనే పరిశోధనల పర్యటనలు 

మద్రాసు వర్సిటీ రిజిస్ట్రార్‌ నిషేధాజ్ఞలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు విద్యార్థినులను తమ ఇళ్లకు పిలిపించుకోవడం, ఒంటరిగా కలుసుకోవడంపై మద్రాసు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీనివాసన్‌ నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని అతిక్రమించిన వారు కఠిన చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు. కాలేజీ విద్యార్థినులు వర్సిటీ తరఫున పర్యాటకానికి, పరిశోధనల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రొఫెసర్లు, తోటి విద్యార్థుల వల్ల లైంగిక దాడులు లేదా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినులపై లైంగిక వేధింపులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.

ఇటీవల అరుంబుకోటై ప్రయివేటు కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విద్యార్థినులతో సెల్‌ఫోన్‌లో అసభ్య సంభాషణ చేయడం కలకలం రేపింది. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అధ్యాపకులపై దాడులకు దిగడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడం జరుగుతోంది. విద్యాలయాల్లో పెచ్చుమీరిపోతున్న ఇలాంటి దుర్భర పరిస్థితులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మద్రాసు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ శ్రీనివాసన్‌ అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు శనివారం స్పష్టమైన సర్క్యులర్‌ను జారీచేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

కళాశాల ప్రొఫెసర్లతో కాలేజీ విద్యార్థినులు కళాశాల పర్యాటకం పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లరాదు. పరిశోధనల కోసం ప్రొఫెసర్లతో కలిసి పీహెచ్‌డీ విద్యార్థినులు బయటకు వెళ్లాలన్నా, ఇతర ప్రదేశాల్లో బసచేయాలన్నా వర్సిటీ అనుమతి తీసుకోవాలి. వర్సిటీ, కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వర్సిటీ బా«ధ్యత. వర్సిటీ, కళాశాల ప్రాంగణంలో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులు, మహిళా ప్రొఫెసర్లు నేరుగా వైస్‌ చాన్స్‌లర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించేందుకు ఇళ్లకు రావాల్సిందిగా ప్రొఫెసర్లు పిలిచినా విద్యార్థినులు వెళ్లరాదు.

లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించేందుకు యూజీసీ ఆదేశాల మేరకు ప్రొఫెసర్‌ రీటా జాన్‌ నాయకత్వంలో ఒక బృందాన్ని నియమించాం. విద్యార్థులు లేదా ప్రొఫెసర్లు లైంగిక చర్యలకు పాల్పడినట్లు రుజువైతే ఈ బృందం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ సర్క్యులర్‌లో రిజిస్ట్రార్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్లను విద్యార్థినులు ఒంటరిగా కలవరాదు, వారి ఇళ్లకు వెళ్లరాదు అంటూ లైంగిక వేధింపులను అరికట్టేందుకు మద్రాసు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అకస్మాత్తుగా ఇలాంటి నిషేధాజ్ఞలు జారీచేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి చర్యలు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా