కలచివేసే కథనం.. 19 ఏళ్లుగా మరుగుదొడ్లో నివాసం

23 Aug, 2019 12:31 IST|Sakshi

చెన్నై: బహిరంగ మరుగుదొడ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం నిమిత్తం ఓ పది నిమిషాలు వెళ్లాల్సి వస్తేనే.. ఏదో నరకంలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 19 సంవత్సరాల నుంచి ఆ మరుగుదొడ్డిలోనే నివసిస్తుంది. వినడానికే జుగుప్సాకరంగా ఉంటే.. అక్కడే జీవనం సాగిస్తున్న సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడులోని మధురైలో వెలుగు చూసింది.

వివరాలు.. కరుప్పాయి(65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా మదురై రామ్‌నాద్‌ ప్రాంతంలో బహిరంగ మరుగుదొడ్లో నివాసం ఉంటుంది. టాయిలెట్‌ వినియోగించుకోవడానికి వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ.. మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అక్కడే జీవనం సాగిస్తుంది. న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ కరుప్పాయి దీనగాథ గురించి ప్రచురించడంతో ఆమె అవస్థ గురించి జనాలకు తెలిసింది. ఏఎన్‌ఐ కథనం ప్రకారం.. కరుప్పాయి భర్త మరణించాడు. ఓ కూతురు ఉంది కానీ ఆమె తల్లిని పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో ఎవరూ లేని కరుప్పాయి గత 19 ఏళ్లుగా బహిరంగ మరుగుదొడ్లను తన నివాసంగా చేసుకుని దాని మీద వచ్చే అతి తక్కువ ఆదాయంతో రోజులు వెళ్లదీస్తుంది. కరుప్పాయికి కనీసం వృద్ధాప్య పెన్షన్‌ కూడా లభించడం లేదు.
 

ఈ విషయం గురించి కరుప్పాయిని ప్రశ్నించగా.. ‘వృద్ధాప్య పెన్షన్‌కు అప్లై చేశాను. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకొక ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా ఎందరో అధికారులను కలిశాను. కానీ ఎవరు నా మొర ఆలకించలేదు. దాంతో ఈ మరుగుదొడ్లోనే ఒక దాన్ని నా నివాసంగా మార్చుకుని ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నాను. వీటి మీద రోజుకు నాకు రూ.70-80 ఆదాయం లభిస్తుంది.అదే నా జీవనాధారం. నాకు ఓ కుమార్తె ఉంది కానీ తను నన్ను పట్టించుకోదు’ అంటూ కరుప్పాయి వాపోయింది. ప్రస్తుతం కరుప్పాయి కథనం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

కొందరు నెటిజన్లు ఈ కథనాన్ని నరేంద్రమోదీకి ట్యాగ్‌ చేస్తూ.. ఆమెకు ఇంటిని, పెన్షన్‌ను మంజూరు చేసి ఆదుకోమ్మని కోరుతుండగా.. మరి కొందరు ‘నీలాంటి పేదలు, వృద్ధులను సరిగా పట్టించుకోని ఈ సమాజం సిగ్గుతో ఉరి వేసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది’.. ‘ఈ దేశం పేదలకోసం కాదు’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దీనురాలి మొర ఆలకిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు