మ్యాజిక్‌ చేయబోయి గల్లంతైన మేజిషియన్‌

17 Jun, 2019 09:35 IST|Sakshi

కోల్‌కతా : ఇంద్రజాల ప్రదర్శనతో జనాలను ఆశ్చర్యపరచాలని భావించిన ఓ మేజిషియన్‌ చివరకు తానే కానరాకుండా పోవడంతో విషాదం అలుముకుంది. మ్యాజిక్‌ అంటేనే రకారకాల ట్రిక్కులు ప్రయోగించి క్షణాల్లో మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక వేళ అవి ఫెయిలయితే ఫలితం దారుణంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి కోల్‌కతాలో చోటు చేసుకుంది. ట్రిక్కు పని చేయకపోవడంతో ఏకంగా మేజిషయనే గల్లంతయ్యాడు. వివారాలు.. జాదుగర్‌ మంద్‌రాకేగా ప్రసిద్ధి పొందిన చంచల్‌ లాహిరి (40) ఆదివారం పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు చూస్తుండగా విన్యాసం ప్రదర్శించేందుకు గంగా నదిలోకి దిగారు.

ఉక్కు సంకెళ్లు, తాడుతో తనను తాను ఓ బాక్స్‌లో బంధించుకుని గంగా నదిలోకి దిగి సురక్షితంగా బయటకు వచ్చే విన్యాసాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగారు చంచల్‌ లాహిరి. కానీ దురదృష్టవశాత్తు  కనిపించకుండా పోవడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 21 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసం విజయవంతంగా చేసినట్లు విన్యాసం ప్రారంభానికి ముందు లాహిరి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ బాక్సులో కూర్చుని సంకెళ్లతో బంధించుకున్నాను. తాళం వేసేశారు. 29సెకన్లలో బయటికి వచ్చేశాను. ఈసారి బయటకు రావడం కష్టమే. బయటకు రాగలిగితే మ్యాజిక్‌ అవుతుంది. లేదంటే ట్రాజిక్‌ అవుతుంది’ అని లాహిరి వ్యాఖ్యానించారు. ఆయన ఊహించినట్లే మ్యాజిక్‌ కాస్తా ట్రాజిక్‌ అవడం విచారకరం.

మరిన్ని వార్తలు