కరోనా సంక్షోభం: విద్యుత్‌ టారిఫ్‌లు తగ్గింపు!

31 Mar, 2020 14:22 IST|Sakshi

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా సంక్షోభంతో వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ టారిఫ్‌లు తగ్గించనున్నట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్ల పాటు అధిక చార్జీల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంది. వాణిజ్య రాజధాని అయిన ముంబైలో వినియోగదారులకు విద్యుత్‌ అందిస్తున్న ప్రైవేటు డిస్కంలు అయిన అదానీ ఎనర్జీ, టాటా పవర్‌కు 18-20 శాతం, వాణిజ్య అవసరాల నిమిత్తం వాడుకుంటున్న విద్యుత్‌కు 19-20 శాతం, ముంబైవాసులకు 10- 11 శాతం టారిఫ్‌లు తగ్గనున్నట్లు పేర్కొంది. (కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు)

అదే విధంగా వ్యవసాయం కోసం వినియోగించే విద్యుత్‌కు 1 శాతం పన్ను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అన్ని రకాల విద్యుత్‌ టారిఫ్‌లపై సగటున 7-8 శాతం కోత విధిస్తున్నట్లు మహారాష్ట్ర విద్యుత్‌ క్రమబద్దీకరణ కమిషన్‌(ఎమ్‌ఈఆర్‌సీ) ప్రకటన విడుదల చేసింది. రాజధానిని మినహాయించి ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి 10-12 శాతం, గృహావసరాల నిమిత్తం విద్యుత్‌ వినియోగిస్తున్న వారికి 5-7 శాతం ధర తగ్గించి ఊరట కలిగించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఎమ్‌ఈఆర్‌సీ చైర్మన్‌ ఆనంద్‌ కులకర్ణి మాట్లాడుతూ.. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని... దీని కారణంగా ఖజానాపై ఎటువంటి అదనపు భారం పడబోదని తెలిపారు. ఇక విద్యుత్‌ చార్జీలు తగ్గిన నేపథ్యంలో విద్యుత్‌ను దుర్వినియోగం చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు