కులాంతర వివాహాల రక్షణకు కొత్త చట్టం

6 May, 2018 19:07 IST|Sakshi

కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తచట్టం

సాక్షి, ముంబై: కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులపై జరుగుతున్న దాడులను, పరువు హత్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపకల్పన చేయాలని దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వం భావిస్తోంది. దంపతులకు రక్షణ కల్పించి, ప్రోత్సాహకాలు అందించే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ బడోల్‌ తెలిపారు.

కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల పిల్లలకు రిజర్వేషన్లు, ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తోందని, ఢిల్లీలోని అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ 2.5 లక్షల నగదు అందిస్తోందని తెలియజేశారు. మరో రెండు నెలల్లో చట్టం ముసాయిదాను సిద్ధం చేస్తామని కమిటీ చైర్మన్‌ సీఎస్‌ తూల్‌ ప్రకటించారు.

దేశంలో కులాంతర వివాహాం చేసుకున్న జంటలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీఎస్‌ తూల్‌ అభిప్రాయపడ్డారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్‌ ప్రకారం పరువు హత్యల్లో మహారాష్ట్ర, దేశంలో నాలుగో స్థానంలో ఉంది. 2016 లో జరిపిన సర్వేలో మహారాష్ట్రలో 69 కేసులు నమోదు కాగా, ఎనిమిది మందిని పరువు హత్య పేరుతో హతమార్చినట్లు నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గుర్తించింది.

మరిన్ని వార్తలు