మరాఠాలకు రిజర్వేషన్లు

19 Nov, 2018 03:54 IST|Sakshi
దేవేంద్ర ఫడ్నవిస్‌

మహారాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

సీఎం ఫడ్నవిస్‌ వెల్లడి

ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆదివారం చెప్పారు. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం’ (ఎస్‌ఈబీసీ – సోషల్లీ అండ్‌ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌) కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్‌ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిందనీ, రిజర్వేషన్‌ ఎంత శాతం ఇవ్వాలనేది మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయిస్తుందన్నారు. తమిళ నాడులో మాదిరిగా 16 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశ ముందని భావిస్తున్నారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 68 శాతా నికి చేరతాయి.

నేడు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది. కీలకమైన మరాఠాలు రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్నారు. గతవారం బీసీ కమిషన్‌ నివేదిక సమర్పించిన వెంటనే మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయమై ఫడ్నవిస్‌ సానుకూలగానే స్పందించారు. ఎన్నో ఏళ్లుగా మరాఠాలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలు చాలా తక్కువగా ఉన్నారనీ, కాబట్టి వారిని ఎస్‌ఈబీసీలుగా పరిగణిస్తున్నట్లు బీసీ కమిషన్‌ పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణం 15 (4), 16 (4)ల ప్రకారం ఎస్‌ఈబీసీలకు రిజర్వేషన్ల ఫలాలను అనుమతించవచ్చు. మరాఠాలకు రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్ల శాతం 50కి పైగా పెరిగితే అది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ఇది ప్రత్యేక అంశమని ఫడ్నవిస్‌ చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు