సీఎం ప‌ద‌వికి గండం..ఎమ్మెల్సీ ప‌దవి ఇవ్వండి

9 Apr, 2020 16:24 IST|Sakshi

ముంబై :  ముఖ్యమంత్రి ఉద్ద‌వ్‌ఠాక్రేను ఇప్ప‌డు ప‌ద‌వీ గండం వెంటాడుతోందా అంటే అవున‌నే అనిపిస్తోంది. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి 6 నెల‌ల్లోగా ఏదైనా చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుడిగా నామినేట్ కావాల్సి ఉంటుంది. అయితే ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభంలో అన్ని రాష్ర్టాల్లో  ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కోరింది.

2019 నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప‌ద‌వీకాలం మే 28లోగా ముగుస్తుంది. దీంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధ్యక్షతన గురువారం జ‌రిపిన కేబినెట్ స‌మావేశంలో ఉద్ద‌వ్‌ఠాక్రేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ తీర్మానం చేశారు.  ఒకవేళ గవర్నర్ ఈ తీర్మానాన్ని ఆమోదించకపోతే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లాక్‌డౌన్ ఎప్ప‌డు ముగుస్తుంద‌నేది ఇంకా తెలియ‌లేదు. ఒక‌వేళ ముగిసినా మే 28లోపు మ‌హారాష్ర్ట‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం అసాద్యంలా క‌నిపిస్తోంది. ఎందుకంటే దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు అక్క‌డే న‌మోద‌య్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 1135 కరోనా పాజిటివ్ కేసులు  నమోదుకాగా,  72 మంది  చనిపోయారు. రాష్ర్టంలో  శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. 


 

మరిన్ని వార్తలు