రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఫడ్నవీస్

17 Dec, 2018 20:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ వాడిన భాష చాలా దారుణమన్నారు. దళారి లేకుండా రక్షణ ఒప్పందం చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మలేకపోతున్నారన్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 'కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌ గాంధీ రఫెల్ డీల్ పై ఆరోపణలు, అబద్దాలు చెప్తునే ఉన్నారు. రక్షణ విషయంలో అంతర్జాతీయంగా మనదేశ పేరు చెడగొట్టే పని చేశారు. అబద్దాలు చెప్పి ప్రజలని నమ్మించాలనే ప్రయత్నం చేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్థాన్, చైనాలతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే, మన దగ్గర కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు లేవని అర్థం అయింది. రఫెల్ డీల్ వల్ల ఆధునిక హంగులతో, సాంకేతికంగా ఉన్నతమైన యుద్ధ విమానాలు పొందనున్నాము.

6 కంపెనీల నుండి 2008లో టెండర్లు వచ్చాయి. 2011 నవంబర్‌లో టెండర్లు ఓపెన్ చేస్తే డసెల్ ద్వారా తక్కువకి టెండర్లు వచ్చాయి. 2003 నుండి 2011 వరకు కనీసం టెండర్లు ఓపెన్ కూడా చేయలేదు. అది మన దుస్థితి. యూపీఏ హయాంలో దేశ రక్షణ కోసం డబ్బులు లేవని ఈ ఒప్పందానికి మంగళం పాడారు. 2015 లో మోదీ సర్కారు కంబాట్ విమానాల ఆవశ్యకతను గుర్తించి ఫ్రాన్స్, ఇండియా మధ్య ఎలాంటి దళారులు లేకుండా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గతంలో బోఫోర్స్, జీప్, ఆగస్టా వెస్టలాండ్ లాంటివి దళారుల సహాయంతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు.

2016లో ఒప్పందం ఫైనల్ అయింది. 2019 అక్టోబర్ నుండి ఎయిర్ క్రాఫ్ట్ లు రావడం మొదలవుతుంది. రాహుల్ అబద్ధాల మీద అబద్దాలు చెప్పారు. 4 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారు. అందులో కొన్ని కాంగ్రెస్ స్పాన్సర్ చేసినవి. యూపీఏలో 2013 లో పాలసీ ప్రకారమే తర్వాత కొన్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిలయన్స్ కంపెనీకి ఇచ్చారనే ఆరోపణ మీద కూడా, డసోల్‌కి భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్వ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ ఆరోపణలను చాలా స్పష్టంగా కొట్టేశారు. జనరేషన్ 5 యుద్ధ విమానాల కొనుగోలు చాలా అవసరం. కాంగ్రెస్ అబద్ధాల పరదా తొలగిపోయింది. దేశ హితం కోసం భవిష్యత్ కోసం ఆలోచన చేసి మోదీ నిర్ణయం తీసుకుంటారు. రక్షణ ఒప్పందంలో దేశ అంతర్గత విషయాలుంటాయి కాబట్టి అవి బయటికి చెప్పరు, వీటి ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చెయ్యాలని అనుకుంది. కానీ కుదరలేదు. సుప్రీంకోర్టు తీర్పును జేపీసీ ఓవర్ రూల్ చెయ్యలేదు. అందుకే జేపీసీ వెయ్యడం వృధా. రాహుల్ వాడిన భాషకు ప్రజలే సమాధానం చెప్తారు. ఏదైనా కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే వ్యవస్థ మంచిది, వ్యతిరేకంగా వస్తే వ్యవస్థ మీద ఒత్తిడి అంటారు. సుప్రీంకోర్టు తీర్పులో 26వ పేరాలో ధరల విషయంలో లోతుగా పరిశీలన చేశాము కాబట్టి అనుమానం లేదని స్పష్టంగా ఉంది' అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 

మరిన్ని వార్తలు