నిర్లక్ష్యం వల్లే మావోల దాడి

3 May, 2019 04:04 IST|Sakshi
మృతిచెందిన కమెండోల కుటుంబాలను పరామర్శిస్తున్న సీఎం ఫడ్నవిస్‌

గడ్చిరోలి/న్యూఢిల్లీ: గడ్చిరోలి జిల్లాలో 15 మంది పోలీస్‌ కమాండోలు, ఓ డ్రైవర్‌ను బలికొన్న ఘటనలో సిబ్బంది ప్రామాణిక నిర్వహణా విధానాన్ని(ఎస్‌పీవో) పాటించలేదని మహారాష్ట్ర సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. దాదర్‌పూర్‌ వద్ద 36 వాహనాలను దహనం చేసిన మావోలు పోలీసులు అక్కడకు వచ్చేలా ఉచ్చు పన్నారన్నారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలు చిన్న బృందాలుగా విడిపోయి కాలినడకన ఘటనాస్థలికి చేరుకుంటాయని వెల్లడించారు.

కానీ గడ్చిరోలిలో క్విక్‌ రెస్పాన్స్‌ టీం(క్యూఆర్టీ) కమాండోలు నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేటు వ్యానులో దాదర్‌పూర్‌కు బయలుదేరారనీ, తద్వారా మావోలు పక్కా ప్రణాళికతో చేసిన ఐఈడీ దాడిలో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ సందర్భంగా జవాన్లు కనీసం మైన్‌ప్రూఫింగ్‌ వాహనాన్ని వాడకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఇక్కడి భద్రతను, కూంబింగ్‌ ఆపరేషన్లను పురాదా కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్‌ బలగాలు నిర్వహిస్తాయనీ, అయితే వీరంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పోలీస్‌ కమాండోలకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. మావోల దాడి ఘటనను మహారాష్ట్ర డీజీపీ స్వయంగా విచారిస్తారని సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు.

దాడిని ఖండించిన ఎన్‌హెచ్‌ఆర్సీ: గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్యను జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) ఖండించింది. అమరుల కుటుంబాలు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు