ఎమ్మెల్సీగా ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం

18 May, 2020 11:33 IST|Sakshi

ముంబై :  మ‌హారాష్ర్ట ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే స‌హా శాస‌న‌మండ‌లికి ఎన్నికైన 8 మంది సోమ‌వారం  మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మండ‌లి చైర్మ‌న్ రామ్‌రాజే నాయ‌క్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ముఖ్య‌మంత్రి వెంట ఆయ‌న స‌తీమ‌ణి, కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఉన్నారు.  మండ‌లిలో ఖాళీగా ఉన్న 9 స్థానాల‌కు తొమ్మిది మంది స‌భ్యులే  నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వీరంతా మే 14న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు శివ‌సేన నుంచి నీలం గోర్హే, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజీత్‌సింహ్ మోహితే పాటిల్, రమేష్ కరాద్, కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ రాథోడ్, ఎన్సీపీకి  చెందిన శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.  (లాక్‌డౌన్‌ : మహారాష్ట్ర కీలక నిర్ణయం )

మ‌హారాష్ర్ట ముఖ్య‌మంత్రిగా ఉద్ద‌వ్ ఠాక్రే 2019 న‌వంబ‌ర్ 28న ప్రమ‌ణ స్వీకారం చేశారు. అయితే అప్ప‌టికీ ఆయ‌న ఏ చ‌ట్ట‌స‌భల్లోనూ  ( అసెంబ్లీ, మండ‌లి ) సభ్యుడు కాదు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 164 ప్ర‌కారం సీఎంగా భాద్య‌తలు చేప‌ట్టిన ఆరు నెల‌ల్లోపు ఏదేని ఉభ‌య స‌భ‌కు ఎన్నిక కావాల్సి ఉండ‌గా, క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌లు ర‌ద్ద‌య్యాయి. అయితే కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఉద్ద‌వ్‌కు ప‌ద‌వీ గండం త‌ప్పినట్లయ్యింది. ( సీఎం పదవి ఊడకుండా కాపాడండి: ఠాక్రే ) ఒక‌వేళ ఎమ్మెల్సీగా నామినేట్ కాక‌పోయి ఉంటే మే 28 లోపు స్వ‌యంగా ఆయ‌నే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చేది. ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డంతో  ఉద్ద‌వ్ సీఎంగా కొన‌సాగ‌నున్నారు. కాగా మ‌హారాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉద్ద‌వ్ నేతృత్వంలోని శివ‌సేన‌..బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ నేప‌ధ్యంలో బీజేపీతో  ఎన్నో ఏళ్ల మైత్రి బంధానికి శివ‌సేన దూర‌మైంది. కూట‌మి త‌రపున న‌వంబ‌ర్ 28న ముఖ్య‌మంత్రిగా ఉద్ద‌వ్ ఠాక్రే బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  (ఎమ్మెల్సీగా ‘మహా’ సీఎం ఏకగ్రీవం.. )


 

మరిన్ని వార్తలు