యూట్యూబ్‌ వీడియోల ఆధారంగా దొంగతనాలు

30 Oct, 2019 14:56 IST|Sakshi

ముంబై : ఒకప్పుడు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న గురువు దగ్గరో లేదా ఆ విషయం పట్ల పరిజ్ఞానం ఉన్న వారి వద్ద నుంచో నేర్చుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ప్రపంచం మొత్తం మన అరచేతుల్లోకే వచ్చింది. బుజ్జి మొబైల్‌ ఫోన్‌ మనకు గురువులా తయారయ్యింది. గూగుల్‌ తల్లికి తెలియని విషయం, యూట్యూబ్‌లో దొర‍కని సమాచారమంటూ ఏదీ లేదు. అయితే సాంకేతికతను కొంతమంది విఙ్ఞానానికి ఉపయోగించుకుంటుంటే ఓ జంట మాత్రం దానిని దుర్వినియోగం చేసింది. దొంగతనాల కోసం యూట్యూబ్‌ను ఆశ్రయించి చివరకు కటకటాలపాలైంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

వివరాలు... శైలేష్‌ వసంత్‌ దుబ్రే(29), అతని సహచరి గౌరీ(21) అనే వ్యక్తులు హజిఫహద్‌లో నివసిస్తున్నారు. శైలేష్‌ యం.బి.ఏ చదవగా, గౌరీ నాగపూర్‌లోని చిత్రకళ మహవిద్యాలయంలో బీఏ చదువుతోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వీరిద్దరు యూట్యాబ్‌లో చూసి తాళాలు తెరవడం నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి గ్యాస్‌ కటర్‌ గన్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌, దొంగతనాలకు ఉపయోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు