ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర!

7 Jun, 2020 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విస్తరణ అంతకంతకూ అధికమవుతోంది. ఇప్పటికే రెండున్నర లక్షల కేసులతో భారత్‌ ఇటలీని దాటేసి రికార్డులకెక్కగా.. తాజాగా మహారాష్ట్ర కూడా ఓ రికార్డును నమోదు చేసింది. వైశాల్యంలో మూడో స్థానం, జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర బీట్‌ చేసింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 3007 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 85,975కు చేరింది. అదేసమయంలో కోవిడ్‌ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనాలో కేసుల సంఖ్య 83,036 గా ఉంది. (చదవండి: ఇటలీని దాటేసిన భారత్‌)

ఇక దేశ వ్యాప్తంగా 6929 మంది మరణించగా..  ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య మూడు వేలుగా ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70 లక్షల 26 వేలకు చేరగా.. 34 లక్షల 35 వేల మంది కోలుకున్నారు. కాగా, 2,34,801 కేసులతో ఇటలీ ఏడో స్థానంలో ఉండగా.. 2,54,242 కేసులతో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో 82 వేల కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో, 30 వేల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 27 వేల కేసులతో ఢిల్లీ, 19 వేల కేసులతో గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
(చదవండి: ఇది ఎన్నికల ర్యాలీ కాదు : అమిత్‌ షా)

మరిన్ని వార్తలు