రైతు ‘మహా’ విజయం

13 Mar, 2018 02:00 IST|Sakshi
బొబ్బలు తేలిన మహిళా రైతు పాదాలు

కర్షకుల సమస్యలు తీర్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం

ఆదివాసీలు సాగు చేస్తున్న

అటవీ భూములు వారికే

ఆందోళన విరమించిన రైతన్నలు

సాక్షి, ముంబై: మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ సోమవారం ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్‌ అసెంబ్లీ బయట మాట్లాడుతూ ‘రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించాం.

అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలి. వారికి భూములను బదిలీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. డిమాండ్లలోని దాదాపు అన్నింటినీ నిర్ణీత సమయంలోపు మేం నెరవేరుస్తాం’ అని చెప్పారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్‌ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది. తమ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో అలసి సొలసిన రైతన్నలు ఆందోళన విరమించి ఇక తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు.

రైతులను ముంబై నుంచి ఇళ్లకు తిరిగి పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించనుంది. ముంబై నుంచి నాసిక్‌ మీదుగా భుసావల్‌ వరకు రైతుల కోసం 2 రైళ్లను నడపటంతోపాటు ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు జనరల్‌ బోగీలను కూడా తగిలిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. అదనంగా రైతు రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌ను మాత్రం తాము నెరవేర్చలేమని సీఎం చెప్పారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ రుణాలు తీసుకున్నప్పుడు వారిలో ఎవరి పేరున అప్పు తక్కువగా ఉంటే ఆ రుణం మాత్రమే మాఫీ అయిందనీ, దీన్ని సరిదిద్దడానికి ఇంకా ఎంత ఎక్కువ వ్యయం అవుతుందో అంచనా వేయడానికి ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

                     సోమవారం ముంబైలోని ఆజాద్‌ మైదానంలో సమావేశమైన రైతులు

ఒకటే గమ్యం.. ఒకటే గమనం
నడిచి నడిచి పాదాలకు పుండ్లు పడి రక్తాలు కారాయి. తినడానికి సరైన తిండి లేదు. నిద్రపోవడానికి అనువైన జాగా దొరికేది కాదు. మార్చిలోనే మాడుపగిలే ఎండలతో నిస్సత్తువ ఆవహించేది. అయినా మహారాష్ట్ర రైతన్నల అడుగు తడబడలేదు. నడక ఆగలేదు. వారి సంకల్ప బలం చెక్కు చెదరలేదు. అందరి కడుపులు నింపే అన్నదాతలు తమ ఆకలి తీరే మార్గం కోసం, బతుకుదెరువు కోసం చేసిన పాదయాత్ర యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

నాసిక్‌ నుంచి ముంబై వరకు మొత్తం 180 కిలో మీటర్లు సాగిన ఈ రైతు పాదయాత్రలో అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టనష్టాలు.. మహిళా రైతులు కూడా అన్నింటినీ పంటి బిగువున భరించారు. అలుపూసొలుపూ లేకుండా దాదాపు 35 డిగ్రీల మండుటెండలో రోజుకి 30 కిలో మీటర్లు నడిచారు. మహారాష్ట్ర సర్కార్‌ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో తమకెదురైన ఇబ్బందులేమీ పట్టించుకోలేదు. ఒక్కో ఊరు దాటుతుంటే ప్రవాహంలా మరికొందరు రైతులు వారి అడుగుకి అడుగు కలిపారు.   మరాఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రైతులు కదం తొక్కారు. తొలి రోజు 30 వేల మందితో మొదలైన మార్చ్‌లో రోజు గడిచేకొద్దీ రైతుల సంఖ్య పెరిగి ముంబైకొచ్చేసరికి  50 వేలు దాటేసింది.

కనీస సదుపాయాలు లేకున్నా..
డెబ్బయి ఏళ్ల వయసు దాటిన వారు, మహిళా రైతులు కూడా ఈ పాదయాత్రలో ఎక్కువగా కనిపించారు. ఆరురోజుల పాటు సాగిన నడకలో కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. కనీస సదుపాయాలు లేకపోయినా వారు పట్టించుకోలేదు. కొందరు రైతులు బియ్యం, గోధుమలు, పప్పుదినుసుల మూటలను మోస్తూనే నడక సాగించారు. రోడ్డుపక్కనే వండుకొని తినడం, మళ్లీ నడవడం.. రాత్రయ్యేసరికి హైవేపక్కనో, ఏ మైదానాల్లోనో కాసేపు కునుకు తీయడం.. మళ్లీ లేచి నడక నడక.. అలా అదే పనిగా దుమ్ము, ధూళిలో 140 గంటల సేపు నడిచారు. మండిపోతున్న ఎండలో నడవడం వల్ల డయేరియా, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలూ తలెత్తాయి.

‘మేము ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత కష్టం కాదు. మా జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి.పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే ఎలా బతకాలి? అందుకే ఎంతటి బాధనైనా తట్టుకున్నాం’ అని 74 ఏళ్ల వయసున్న శంకర్‌ గావిట్‌ అనే రైతు చెప్పారు. రైతుల దుస్థితిని చూసి చాలా ఊళ్లల్లో స్థానికులే వారిని ఆదుకున్నారు. అంతటి కష్టంలోనూ రైతులు ముంబై విద్యార్థుల కష్టాన్ని గుర్తించారు. ఆదివారం సాయంత్రానికల్లా ముంబై శివార్లకు చేరుకున్న వారు.. తమ పాదయాత్రతో సోమవారం టెన్త్, ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే సదుద్దేశంతో ఆదివారం రాత్రి కూడా నడక సాగించి సూర్యుడు ఉదయించేలోపే ఆజాద్‌ మైదానానికి చేరుకున్నారు.

డబ్బావాలాల ఆహారం.. స్థానికుల ఔదార్యం
ఎన్నో బాధలను భరించి అన్ని కిలోమీటర్లు నడిచొచ్చిన రైతులకు ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. దేశమంతటికీ అన్నం పెట్టే రైతన్నల ఆకలిదప్పులు తీర్చారు. స్వచ్ఛందంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి రైతుల అవసరాలను అడిగి మరీ నెరవేర్చారు. నగరంలో పాదయాత్ర సాగుతుండగా అర్ధరాత్రే అనేక మంది ప్రజలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, డబ్బావాలాలు ట్రక్కులతో మంచినీళ్లు, తిండిపదార్థాలు తీసుకువచ్చి రైతులకు అందించారు. చెప్పులు లేని వారికి కొత్తవి ఇచ్చారు. పాదాల గాయాలకు వైద్య విద్యార్థులు చికిత్స చేశారు. రైతులకు అనూహ్యంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించడంతో మహారాష్ట్ర సర్కార్‌ దిగి రావల్సి వచ్చింది.               

                                సోమవారం తెల్లవారుజామున ఆజాద్‌ మైదానానికి చేరుకుంటున్న రైతులు

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు