సల్మాన్‌ విడుదలపై సుప్రీంకెళ్తాం!

23 Dec, 2015 16:42 IST|Sakshi
సల్మాన్‌ విడుదలపై సుప్రీంకెళ్తాం!

ముంబై: 2002 నాటి 'హిట్‌ అండ్‌ రన్‌' కేసు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను వెంటాడుతూనే ఉంది. కొద్దిరోజుల కిందటే ఈ కేసు నుంచి ఆయనకు బొంబాయి హైకోర్టు విముక్తి కల్పించింది. అయితే, ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర న్యాయ, జ్యుడీషియరి విభాగం ఈ కేసులో అప్పీల్‌కు నిర్ణయించిందని ప్రభుత్వ ప్రతినిధి బొంబాయి హైకోర్టుకు తెలిపారు. సెలవుల అనంతరం జనవరిలో సుప్రీంకోర్టు పునఃప్రారంభం కాగానే ఈ అప్పీల్‌ న్యాయస్థానం ముందుకురానుంది.

13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బొంబాయి హైకోర్టు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఆయనపై ఉన్న అన్ని అభియోగాలనూ తోసిపుచ్చింది. అంతకుముందు సెషన్‌ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.


2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్‌లో మద్యం సేవించి,  వాహనంలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్‌ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై దూసుకెళ్లాడని, ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిపై మోపిన ఆరోపణలకు ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు లేవంటూ హైకోర్టు కేసును కొట్టివేసింది. ప్రమాదం సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లుగానీ, డ్రైవింగ్ తానే చేస్తున్నట్లుగానీ ప్రాసిక్యూషన్ నిర్దిష్టంగా నిరూపించలేకపోయిందని హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు