మధ్యతరగతికి సొంత ఇల్లు

15 Aug, 2014 22:33 IST|Sakshi
మధ్యతరగతికి సొంత ఇల్లు

 ముంబై: రాష్ట్రంలోని నగరాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆయన మంత్రాలయ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ముంబై సహా ఇతర మహా నగరాల్లో నివసిస్తున్న మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. త్వరలోనే దీనికోసం కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో మహారాష్ట్రను ‘ఆన్‌లైన్’ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చవాన్ చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తమకు కావాల్సిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చునన్నారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే  పారదర్శక, స్ఫూర్తిదాయక పాలన అందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పల్లెలకు సైతం ఈ పథకం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. తమ ప్రభుత్వం మరాఠాలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల వల్ల మైనారిటీ వర్గాలైన ముస్లింలు, మరాఠాలు ఉద్యోగ,విద్యా రంగాల్లో తగిన అవకాశాలు పొందగలుగుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య యోజన పథకం ద్వారా లబ్ధిదారులు పైసా ఖర్చు లేకుండానే తగిన వైద్య సేవలు పొందగలుగుతున్నారన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.62 లక్షల మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం వీరి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.712 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు.

 ఇదిలా ఉండగా, నాగపూర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నితిన్ రావుత్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెండో రాజధాని అయిన నాగపూర్‌ను దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆలోచనలకు రూపంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు డీఎఫ్ సర్కార్ కృషిచేస్తోందని అన్నారు. నగరానికి పశ్చిమంలో 1800 ఎకరాల్లో గోరెవాడా జూను అభివృద్ధిచేసేందుకు కార్యాచరణ రూపొంది స్తున్నామన్నారు. పుణ్యక్షేత్రమైన సుఫీ సెయింట్ బాబా తాజుద్దీన్ సమాధి వద్ద రూ.132.49 కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు.

అలాగే ఆహార భద్రత చట్టం కింద సుమారు 7.17 కోట్ల మందికి ఆహార దినుసులను అందజేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.900 కోట్లు ఖర్చుపెడుతోందని రావుత్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కృష్ణ, పోలీస్ కమిషనర్ కె.కె.పాఠక్, డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, గడ్చిరోలీ జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  
 
 ‘మాఝీ ముంబై- నిర్మల్ ముంబై’ డ్రైవ్ ప్రారంభం
 ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ‘మాఝీ ముంబై-నిర్మల్ ముంబై’ అనే కార్యక్రమాన్ని ధారవిలో  ప్రారంభించారు. నగరంలో జనాభా విపరీతంగా  పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో చెత్త సమస్య చాలా ఎక్కువగా ఉంద న్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు చవాన్ వివరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు