ఎన్నిక‌లు నిర్వ‌హించండి.. ఈసీకి గ‌వ‌ర్న‌ర్‌ లేఖ

1 May, 2020 10:09 IST|Sakshi

ముంబై : ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్‌ఠాక్రేకు క‌రోనా క‌న్నా ప‌ద‌వీ సంక్షోభం ఎక్కువగా ప‌ట్టుకుంది. సీఎం ప‌ద‌వి ఉంటుందా ఊడుతుందా అన్న దానిపై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్టంలో ఖాళీ అయిన 9 ఎమ్మెల్సీ స్థానాల‌కు  ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. లాక్‌డౌన్‌ను అమ‌లుచేస్తున్న నేప‌థ్యంలో కేంద్రం ఇచ్చిన స‌డ‌లింపుల దృష్ట్యా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా కోరారు.  (ఉద్ద‌వ్ ఠాక్రే ప‌ద‌వీ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారా? )
 

గత ఏడాది నవంబర్‌ 28న  ఉద్ద‌వ్ ఠాక్రే ముఖ్య‌మంత్రిగా  పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఏ సభల్లోనూ (అసెంబ్లీ, మండలి) ఆయనకు ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో ఏదో ఒక సభకు కాక‌పోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మే 28న గ‌డువు ముగుస్తున్నందున ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా  చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. 

గవ‌ర్న‌ర్ కోటాలో ఉద్ద‌వ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నామినెట్ చేసే అవ‌కాశం ఉన్నా కోశ్యారీ అందుకు సుముఖంగా లేరు. ఇదివ‌ర‌కే రెండుసార్లు రాష్ర్ట మంత్రివ‌ర్గం ఈ ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ముందుంచినా ఆయ‌న దాన్ని సున్నితంగా తిర‌స్క‌రించారు. రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నందున జోక్యం చేసుకోవాల‌ని ఉద్ద‌వ్ ప్ర‌ధాని మోదీని కోరారు. స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ మే 28 గుర్తుచేస్తున్న నేప‌థ్యంలో ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. దేశంలో  న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లోనే వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా అంటే లేద‌నే సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. మ‌రి ఎన్నో ట్విస్టుల మ‌ధ్య సీఎం ప‌ద‌విని సొంతం చేసుకున్న ఉద్ద‌వ్ ఠాక్రే సంబ‌రం ఆరు నెల‌ల్లోనే ముగుస్తుందా అనేది ఉత్కంఠ‌గా మారింది.  (సీఎం పదవి ఊడకుండా కాపాడండి: ఠాక్రే )

మరిన్ని వార్తలు