అరెస్ట్‌లకు ఆధారాలు ఉన్నాయి: మహారాష్ట్ర ప్రభుత్వం

5 Sep, 2018 13:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భీమా కోరెగావ్‌ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తలు అరెస్ట్‌లపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారన్న కారణంతో వారిని అరెస్ట్‌ చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్ట్‌ అయిన ఐదుగురిపై పోలీసుల వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అసమ్మతి, అభిప్రాయ భేదాల కారణంగా వారిని అరెస్ట్‌ చేయలేదని వెల్లడించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా, భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర  చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్‌, గౌతం నావ్‌లాక్‌, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్‌ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్‌లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని.. సెప్టెంబరు 5 వరకు హౌజ్‌ అరెస్టులో ఉంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు