మూడేళ్లలో 12వేల మంది రైతుల ఆత్మహత్య

21 Jun, 2019 15:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : గడిచిన మూడేళ్లలో మహారాష్ట్రలో 12 వేలకు పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2015 నుంచి 2018 మధ్యకాలంలో ఈ ఆత్మహత్యలు నమోదైనట్టు రాష్ట్ర మంత్రి సుభాష్‌ దేశ్‌ముఖ్‌ శాసనసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఈ మూడేళ్లలో మొత్తం 12,021 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 6,888 మంది ప్రభుత్వం నుంచి పరిహారం  పొందేందుకు అర్హులుగా ఆయా జిల్లాల అధికారులు గుర్తించారని తెలిపారు. ఇప్పటివరకు 6,845 రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్టు పేర్కొన్నారు.

కాగా, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 610 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. వారిలో 192 మందిని సాయం పొందడానికి అర్హులుగా గుర్తించి.. 182 రైతు కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందజేశామని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన రైతుల ఆత్మహత్యలపై కూడా పరిశీలన జరుగుతుందని తెలిపారు. వారి కుటుంబాలు పరిహారం అందుకోవడానికి అర్హులా, కాదా అనే అంశం తెలాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు