ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్‌తో ఉద్యోగాలు.. భారీ షాక్‌!

4 Feb, 2018 10:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తోన్న 11,700 మందిపై వేటు వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎస్సీ, ఎస్టీలుగా చెలామణి అవుతూ 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తున్నవారి జాబితాలో క్లర్క్‌ నుంచి సీనియర్‌ కార్యదర్శులదాకా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నకిలీ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని, అయితే ఒకే దఫాలో వేటు వేస్తే ఎదురయ్యే న్యాయసమస్యలపై చర్యలు జరుపుతున్నామని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమిత్ ములి మీడియాకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం(ఫిబ్రవరి 5న) పలు ఉద్యోగ సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నాయకులతో సీఎస్‌ భేటీ కానున్నారు. సీఎం ఫడ్నవిస్‌ సూచన మేరకు జరుగనున్న ఈ భేటీల అనంతరం ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తూ.. : మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో గడిచిన నాలుగు దశాబద్దాలుగా 63,600 మంది ఉద్యోగాలు పొందారు. వారిలో 51,100 మంది అసలైన అర్హులుకాగా, మిగిలిన 11,700 మంది ఫేక్‌ సర్టిఫికేట్లతో అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారు. అక్రమ ఉద్యోగులపై కొన్ని దళిత, గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ‘‘ఒక వ్యక్తి దీర్ఘ కాలం సర్వీసులో ఉన్నప్పుడు అతని కుల ధృవీకరణ తప్పని తేలితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరంలేదు’’ అన్న ముంబై హైకోర్టు తీర్పు మరింత గందరగోళానికి దారితీసింది.

ఆ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. 2017 జులైలో సంచలన తీర్పు చెప్పింది. ‘‘రిజర్వేషన్ కేటగరిలో నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటుకావని, అలా ఉద్యోగాలు చేస్తున్న వారిని విధుల నుంచి తప్పించాల్సిందే’’నని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఆ 11,700 మందిపై వేటుకు రంగం సిద్ధమైంది.

మరిన్ని వార్తలు