కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం

2 May, 2020 13:37 IST|Sakshi
రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే (ఫైల్ ఫోటో)

 ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా

మహాత్మా జ్యోతిబా ఫులే జన్ ఆరోగ్య యోజన  పథకం  కింద ఈ సౌకర్యం

సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం, మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించిన  సమయంలో మహారాష్ట్ర  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తన పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా  సౌకర్యాన్ని    కల్పిస్తున్నట్టు  ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే శుక్రవారం ప్రకటించారు. దీంతో దేశంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.  అలాగే ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైరస్ రోగుల  చికిత్స ఫీజును కూడా పరిమితం చేసింది

మహాత్మా జ్యోతిబా ఫులే జన్ ఆరోగ్య యోజన పథకం కింద రాష్ట్రంలోని ప్రజలు ఉచిత, నగదు రహిత ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం వంటి పత్రాలు  సమర్పించాల్సి వుంటుంది.  ప్రస్తుతం, ఈ పథకం జనాభాలో 85 శాతం ప్రయోజనం పొందుతున్నారనీ,  తాజా నిర్ణయంతో  మిగిలిన 15శాతం మందికి కూడా లబ్ధి  చేకూరనుందని   రాజేష్ తోపే చెప్పారు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, వైట్ రేషన్ కార్డుదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పూణే, ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టార్ అసోసియేషన్ (జిప్సా) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తోపే తెలిపారు. అన్ని ఆసుపత్రులలో చికిత్స రుసుమును ప్రామాణీకరించడానికి, వివిధ ప్యాకేజీలను రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇంతకుముందు 496 ఆస్పత్రులు ఈ పథకంలో ఉండగా, తాజాగా 1,000 కి పైగా ఆస్పత్రులు దీని పరిధిలోకి వస్తాయని ఆయన చెప్పారు.

కాగా  భారతదేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా  గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,000 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం 485 మంది మరణించారు. దేశంలో  37,336 మందికి సోకగా 1218 మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడగించిన సంగతి తెలిసిందే.   (ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా)

చదవండి :  హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు