రెండు చోట్లా బీజేపీకే పట్టం!

19 Oct, 2014 01:40 IST|Sakshi
రెండు చోట్లా బీజేపీకే పట్టం!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే
 
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ శక్తులైన శివసేన, లోక్‌దళ్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... ఫలితాల సరళి మధ్యాహ్నం వరకే వెల్లడయ్యే అవకాశముంది. మూడు గంటల సమయం నుంచి ఆయా స్థానాల్లో తుది ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుండగా... హర్యానాలో అధికార కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హర్యానాలో76.5 శాతం పోలింగ్ నమోదుకాగా మహారాష్ట్రలో 63.1 శాతం  నమోదైంది. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధాని మోదీ చరిష్మాకు.. ఈ ఎన్నికల ఫలితాలే తొలి పరీక్షగా నిలవనున్నాయి.

మహారాష్ట్రలో హంగ్ ?.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. ప్రధాన పార్టీలైన బీజేపీ 280 స్థానాల్లో, శివసేన 282, కాంగ్రెస్ 287, ఎన్సీపీ 278, ఎంఎన్‌ఎస్ 219 స్థానాల్లో పోటీపడ్డాయి. మహారాష్ట్రలో ఏ పార్టీకీ సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు తప్పకపోవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంతో.. ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. కానీ ఎన్నికల ముందు విడిపోయిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనతో పాటు  ఎన్సీపీ కూడా తామే పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదర్శ్ కుంభకోణంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పరిస్థితిని దిగజార్చాయి. అయితే.. ఫలితాల అనంతరం బీజేపీ, శివసేన తిరిగి పొత్తుపెట్టుకోవచ్చనే వార్తలను ఆ పార్టీలు ఖండించాయి. దీనిపై శనివారం శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ‘‘మహారాష్ట్రలో శివసేన ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది. బీజేపీది ప్రతిపక్షంగా ఉంటుంది’ అని అన్నారు. అయితే ఎన్డీయేలో శివసేన కొనసాగడం నేపథ్యంలో.. మహారాష్ట్రలో తిరిగి బీజేపీ-శివసేన ఒక్కచోటికి చేరడం ఖాయమని విశ్లేషకులటున్నారు. ఎగ్జిట్‌పోల్స్ కూడా మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన నిలుస్తుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ కూడా శివసేనతో ఎన్నికల అనంతర పొత్తుపై కన్నేసిందని చెబుతున్నారు.

హర్యానాలో కాంగ్రెస్ ఔట్.. హర్యానాలోని 90  స్థానాలకు.. అక్కడి అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఐఎన్‌ఎల్డీ తలపడ్డాయి. వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకున్న భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యం ఆదివారం వెలువడనుంది. అయితే కాంగ్రెస్  పదేళ్ల పాలనకు ఈ సారితో తెరపడబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తొలిసారిగా బీజేపీ అధికారాన్ని చేపట్టనుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. ఈ సారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మోదీ ఆకర్షణ బీజేపీకి సీట్లు తీసుకొచ్చినా... మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశముందని అంచనా వేశాయి.
 

మరిన్ని వార్తలు