కరోనా: ఊరటనిచ్చే కబురు చెప్పిన మహారాష్ట్ర

30 May, 2020 16:29 IST|Sakshi

కోవిడ్‌ పేషెంట్ల రికవరీ రేటులో పెరుగుదల 

ముంబై: మహమ్మారి కరోనాతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్ర శనివారం కాస్త ఊరటనిచ్చే కబురును పంచుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్‌ బారిన పడిన వారి కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం శుక్రవారం ఒక్కరోజే 8381 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో 7358 మంది రాజధాని ముంబైకి చెందినవారే కావడం గమనార్హం. కాగా గురువారం నాటికి రోజుకు కేవలం వెయ్యి మంది పేషెంట్లు మాత్రమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా... ఒక్కరోజులోనే రికవరీ రేటులో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడానికి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కోవిడ్‌ గణాంకాలను అప్‌డేట్‌ చేయడమే కారణమని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇక తాజా గణాంకాల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పేషెంట్ల రికవరీ శాతం 31.2 శాతం నుంచి 43.3 శాతానికి చేరుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.(దేశంలో కరోనా విజృంభణ: ఒక్క రోజే 7964 కేసులు

ఈ విషయం గురించి బీఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దక్షా షా మాట్లాడుతూ.. ముంబైలో శుక్రవారం 715 మంది మాత్రమే డిశ్చార్జ్‌ అయ్యారని.. మిగిలిన వాళ్లంతా గత కొన్ని రోజులుగా డిశ్చార్జ్‌ అవుతున్నా వారి వివరాలు సరిగా నమోదుకాలేదన్నారు. వైరస్‌ బారి నుంచి కోలుకున్న వారిలో చాలా మంది ఇంకా హోం- క్వారంటైన్‌లోనే ఉన్నారని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో డేటా అప్‌డేట్‌ చేయడంలో ఆలస్యమైందన్నారు. (కోవిడ్‌-19 : గవర్నర్‌ కీలక నిర్ణయం)

ఇక ఈ విషయం గురించి జాతీయ ఆరోగ్య మిషన్‌ ముంబై డైరెక్టర్‌ అనూప్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రోజూ ఎంతో మంది పేషెంట్లు డిశ్చార్జ్‌ అవుతున్నా.. వారి సంఖ్యను నమోదు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఉదాహరణకు థానేకు చెందిన వ్యక్తి మహమ్మారి బారిన పడి ముంబైలో చికిత్స తీసుకుని కోలుకుంటే.. అతడి వివరాలు ఇటు ముంబై లేదా థానేలో నమోదు చేయడంలో ఏర్పడే గందరగోళం వల్లే గణాంకాల్లో ఈ అనూహ్య పెరుగుదల వచ్చిందన్నారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు 59 వేలు దాటగా.. మృతుల సంఖ్య 2 వేలకు చేరువలో ఉంది. (అలర్ట్‌ : త్వరలో ఆ రాష్ట్రాలపై కరోనా పంజా)

మరిన్ని వార్తలు