ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు

5 Jun, 2020 17:50 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర కొత్త నిబంధన‌

ముంబై: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి కేవలం ఒక్కసారైనా కార్యాలయాలకు వచ్చి హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో జీతంలో కోత విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్‌ శౌనిక్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రోస్టర్ల ప్రకారం ప్రభుత్వోద్యోగులు ఆఫీసుకు రావాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా సెలవు తీసుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.(మహారాష్ట్రలో 2710కి చేరిన కోవిడ్‌ మృతుల సంఖ్య)

ఈ మేరకు..‘‘అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా అధికారులు, ఉద్యోగుల పనివేళలకు సంబంధించిన రోస్టర్లు సిద్ధం చేయాలి. సెలవు మంజూరైన, మెడికల్‌ లీవులో ఉన్న వారు తప్ప ప్రతీ ఒక్క ఉద్యోగి వారానికి ఒక్కరోజైనా కచ్చితంగా కార్యాలయానికి రావాలి’’అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా విభాగాధిపతుల అనుమతి లేకుండా సెలవు తీసుకున్న వారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు.. ఆ వారం మొత్తం జీతాన్ని కట్‌ చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా వారంలో ఒక్కసారైనా ఎవరైతే ఆఫీసుకు వస్తారో.. అందుకు సంబంధించిన మొత్తం జీతం వారి ఖాతాల్లో జమవుతుందని.. అనుమతితో గనుక సెలవు తీసుకుంటే సెలవు దినానికి మాత్రమే జీతంలో కోత ఉంటుందని తెలిపారు. (పుణె పోలీసుల వినూత్న ప్రయోగం!)

ఇక ఈ నిబంధనలు జూన్‌ 8 నుంచి అమల్లోకి వస్తాయని.. లాక్‌డౌన్‌ పొడగింపు నేపథ్యంలో నెలాఖరు వరకు ఇదే పద్ధతిని పాటించాల్సింది ఉంటుందని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గురువారం ఒక్కరోజే అక్కడ 123 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఉద్యోగులు విధుల్లో చేరేందుకు జంకుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాల్లో ఉండిపోయిన కొంతమంది ఇంతవరకు ఆఫీస్‌లో రిపోర్టు చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు ఈ మేరకు కొత్త నిబంధనలు విధించింది. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు